Telugu News » CM Revnath : అప్లికేషన్ల అమ్మకంపై సీఎం సీరియస్.. కీలక ఆదేశాలు

CM Revnath : అప్లికేషన్ల అమ్మకంపై సీఎం సీరియస్.. కీలక ఆదేశాలు

ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైంది.

by admin
CM Revanth Reddy Fires On Sale of Praja Palana Application Form

– ప్రజా పాలనపై సీఎం సమీక్ష
– అధికారుల నుంచి వివరాల సేకరణ
– దరఖాస్తుల అమ్మకాలపై ఆగ్రహం
– కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశం
– రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దు
– పాతవాళ్లకు అన్నీ అందుతాయి
– కొత్తవాళ్లే దరఖాస్తు చేసుకోవాలన్న రేవంత్ రెడ్డి

తెలంగాణ (Telangana) ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రజా పాలన (Praja Palana) కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజల నుంచి అప్లికేషన్లను స్వీకరిస్తోంది. అయితే.. జనం వేలల్లో ఉంటే అప్లికేషన్లు వందల్లో ఉండడంపై విమర్శలు వెల్లువెతుతున్నాయి. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు దళారీలు దరఖాస్తులను అమ్ముకుంటున్నారు. ఒక్కో అప్లికేషన్ రూ.50 నుంచి రూ.100 దాకా వసూలు చేస్తున్నారు. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో ఈ దందా జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సీరియస్ అయ్యారు.

CM Revanth Reddy Fires On Sale of Praja Palana Application Form

ప్రజా పాలన దరఖాస్తులపై అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అభయ హస్తం దరఖాస్తుల అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దరఖాస్తులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైనన్ని అందుబాటులో ఉంచాల్సిందేనని స్పష్టం చేశారు. రైతు భరోసా, పింఛన్లపై అపోహలు వద్దని.. కొత్తగా లబ్ధి పొందాలనుకునేవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పాత లబ్ధిదారులందరికీ యధాతథంగా అన్నీ అందుతాయని తెలిపారు.

ప్రజాపాలన దరఖాస్తుల సరళి, క్షేత్ర స్థాయిలో పరిస్థితులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ప్రజా పాలన కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటి వరకు జరిగిన గ్రామ సభలు, దరఖాస్తుల వివరాలు, ప్రజా పాలన దరఖాస్తులు స్వీకరిస్తున్న విధానం, ప్రజల్లో స్పందనకు సంబంధించి పూర్తి వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తు చేసుకోవాలనుకునేవారికి ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.

అప్లికేషన్లు అమ్మేవారిపై ఫోకస్ పెట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రజా పాలన కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు విధిగా భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజాపాలన క్యాంపుల్లో దరఖాస్తుదారులకు తాగునీరు, సరైన నీడ కోసం టెంట్లు, ఇతర ఏర్పాట్లలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని అధికారులకు మరోసారి స్పష్టంగా సూచించారు రేవంత్ రెడ్డి. ఈ సమీక్ష అనంతరం సీఎంని పుదుచ్చేరి మాజీ ముఖ్యమంత్రులు నారాయణస్వామి, వైద్యలింగం సహా పలువురు నాయకులు కలిశారు.

You may also like

Leave a Comment