త్వరలో లోక్ సభ ఎన్నికలున్న నేపథ్యంలో తెలంగాణ (Telangana) సీఎం హస్తినకు ప్రయాణం అయ్యారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నామినేటెడ్ పోస్టులపై హైకమాండ్‌తో ఆయన చర్చించనున్నారు. మరోవైపు ఈ సాయంత్రం ఏఐసీసీ అధికార ప్రతినిధి సుర్జేవాలా కుమారుడి వివాహానికి హాజరు కావడంతో పాటు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో ప్రత్యేకంగా సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాల సమాచారం..
ఈమేరకు మధ్యాహ్నం 3 గంటలకు సీఎంతోపాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబులు కూడా ఢిల్లీ (Delhi)వెళ్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే రేవంత్‌రెడ్డి ప్రధానంగా లోకసభ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ, మంత్రివర్గ విస్తరణ తదితర అంశాలపై పార్టీ అధిష్ఠానంతో చర్చిస్తారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపథ్యంలో ఈ పనులన్నీ త్వరగా ముగించుకోవాలనే ఉద్దేశ్యంలో ఆయన ఉన్నట్లు తెలుస్తోంది.
మరోవైపు హస్తం పార్టీలోకి ఇటీవల చేరికలు పెరగడం, మరికొందరు నాయకులు చేరేందుకు సిద్ధంగా ఉండటం గురించి హైకమాండ్‌తో కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. అదేవిధంగా శాసనసభ ఎన్నికల సమయంలో టికెట్ రాని నాయకులకు, పార్టీ గెలుపుకు పని చేసిన నేతలకు నామినేటెడ్ పదవుల భర్తీలో ప్రాధాన్యత ఇస్తామని ఇప్పటికే సీఎం హామీ ఇచ్చారు. అయితే గత కొన్నిరోజులుగా వీటి భర్తీ విషయంలో కసరత్తు కొనసాగుతోంది.
ఇప్పటికే ఇందుకు సంబంధించిన జాబితాలను దీపాదాస్ మున్షీ, ఏఐసీసీ ఇంఛార్జ్ కార్యదర్శులు సిద్దం చేశారు. సీనియర్ నాయకులతో కూడా చర్చించిన పీసీసీ అధ్యక్షుడు, సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) ఏఐసీసీతో సమావేశమై తుది నిర్ణయానికి రావాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో సమావేశమై ఈ అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.
అదే విధంగా వీలైనన్ని ఎక్కువ శాఖల మంత్రులను కలిసి తెలంగాణకు రావాల్సిన నిధులను మంజూరు చేయాలని కోరే ఆలోచనలో ఉన్న రేవంత్.. పెండింగ్ నిధులు, కొత్తగా ఇవ్వాల్సిన నిధుల కేటాయింపు తదితర అంశాలపై వారు కేంద్రం దృష్టికి తీసుకెళ్తారని భావిస్తున్నట్లు సమాచారం. అందుకే రేపు వివిధ శాఖల కేంద్ర మంత్రులను సీఎం రేవంత్‌రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క (Deputy CMinister Bhatti Vikramarka), ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు కలువనున్నారని తెలుస్తోంది.