తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటికే పలుశాఖల ప్రక్షాళన పై దృష్టి సారించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో తాజాగా రాజధాని మెట్రో రైలు (Metro Railway) పొడిగింపుపై కీలక నిర్ణయాలు తీసుకొనే దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ మెట్రో రైల్వే లైన్ పొడిగింపు, ప్రస్తుత పరిస్థితులపై అధికారులతో మంగళవారం సమీక్ష నిర్వహించారు.
శంషాబాద్ విమానాశ్రయానికి (Shamshabad Airport) మెట్రో మార్గం… మియాపూర్ నుంచి రామచంద్రాపురంకు, మైండ్ స్పేస్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు మెట్రో పొడిగింపు తదితర అంశాలపై నిన్న స్పందించిన సీఎం.. ఈ రోజు మెట్రో రైలుకు సంబంధించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సుమన్ భేరి, సభ్యుడు వీకే సారస్వత్ సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు.
ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సైతంపాల్గొన్నారు. మరోవైపు ఎయిర్‌పోర్టు మెట్రోను రద్దు చేయటం లేదని స్పష్టతనిచ్చిన ముఖ్యమంత్రి, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని తెలిపారు. విమానాశ్రయానికి గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గించి మెట్రో నిర్మిస్తామని వెల్లడించారు..
ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ వరకు మెట్రో ఉంటుందని స్పష్టం చేశారు. నాగోల్ నుంచి ఎల్బీనగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్ట వద్ద ఎయిర్‌పోర్టుకు వెళ్లే మెట్రో లైన్‌ను లింక్ చేస్తామని రేవంత్ తెలిపారు.