త్వరలోనే ఇందిరమ్మ కమిటీలను నియమించి, సంక్షేమ పథకాల (Welfare Schemes)ను ప్రజలకు చేరుస్తామని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలని జిల్లా ఇంఛార్జ్ లు, ఎమ్మెల్యేలకు సీఎం సూచించారు. నియోజకవర్గంలో నిజాయితీ, నిబద్దత ఉన్న అధికారులను నియమించుకోవాలని అన్నారు.
హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ…. ప్రతి నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్పెషల్ డెవలప్మెంట్ నిధులు కేటాయిస్తున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ఈ నిధుల బాధ్యతను ఉమ్మడి జిల్లాల ఇంఛార్జ్ మంత్రులకు అప్పగిస్తున్నామని అన్నారు. ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే పనులు చేయొద్దని ఐదు జిల్లాల ఇంఛార్జ్‌లకు, ఎమ్మెల్యేలకు, పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ప్రభుత్వ శాఖల్లో అవినీతి అధికారులను ప్రోత్సహించేది లేదని స్పష్టం చేశారు. పోలీసుల బదిలీల్లో పైరవీలకు తావు లేదని వెల్లడించారు.
పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలని సూచించారు. రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంఛార్జ్ మంత్రులతో సమన్వయం చేసుకుంటూ నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని, సమస్యలను పరిష్కరించుకోవాలని పేర్కొన్నారు.
ఇది ఇలా వుంటే గోద్రెజ్ అగ్రోవెట్ ఎండీ బలరాంసింగ్ నేతృత్వంలోని బృందం సచివాలయంలో సీఎంను కలిసింది. తెలంగాణలో స్థిరాస్తి వ్యాపారం, ఫర్నీచర్ రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని ఈ సందర్బంగా ఆ బృందాన్ని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, సీఎస్ శాంతికుమారి పాల్గొన్నారు.