*రైతు బంధులో అవినీతి చోటు చేసుకొందంటున్న కాంగ్రెస్..
*బీడు భూములకు, ఫామ్ హౌస్‌లకు, కొండలూ, గుట్టలకూ సైతం రైతు బంధు..
*ధరణి పోర్టల్ లో దాగున్న నిజాలపై సర్కార్ ఫోకస్ ..
తెలంగాణ (Telangana) రాష్ట్రంలో రైతు బంధుపై నీలినీడలు కమ్ముకొన్నాయని అంటున్నారు.. అయితే బీఆర్ఎస్ (BRS) హయాంలో అమలైన రైతు బంధులో పెద్ద మొత్తంలో అవినీతి చోటు చేసుకొందనే వాదనలు సైతం తెరమీదికి వస్తున్నాయి. కేసీఆర్ (KCR) అమలు చేసిన రైతు బంధు పథకం (Rythu Bandhu Scheme) పేద రైతులకు కాకుండా సంపన్న రైతులకు మేలు చేసిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది.
రాష్ట్రంలో కేవలం పది శాతం ఉన్న సంపన్న రైతులకు.. రైతు బంధు నిధులలో 55శాతం అందాయని గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు.. బీడు భూములకు, ఫామ్ హౌస్‌లకు, కొండలూ, గుట్టలకూ రైతు బంధు నిధులను విడుదల చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు కాలువలకు, ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్న భూములకు సైతం రైతు బంధు అమలైందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.
సాగులో లేని భూములు, రియల్ ఎస్టేట్ భూములకు కూడా నిధులను అందాయంటే కేసీఆర్ హయాంలో సంక్షేమం ఎవరికి అందిందో అవగతమౌతోందని తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి రైతు బంధు పథకం.. అడ్డదారులు తొక్కిందని.. ఈ నిజాలు కూడా బయటకి తీస్తామనే ధీమాని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రైతు బంధు పథకం కింద లబ్ధి పొందిన వారిలో ఎకరం లోపు భూమి ఉన్నవారు 22.55లక్షల మంది. అలాగే 5 ఎకరాల లోపు భూమి ఉన్న రైతులు 62.34 లక్షల మంది ఉన్నారని వెల్లడిస్తున్నారు.
ఇలా అధిక భూమి ఉన్న వారికి కూడా.. తక్కువ భూమి ఉన్న రైతులతో పాటు రైతు బంధు నిధులు ఇవ్వడం రాష్ట్ర ఆర్థిక స్థితి దివాలకు కారణమని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.. సాగులో లేని భూములకు, అసలు రైతులే కాని వారికి కేవలం భూ యజమానులన్న కారణంతో అప్పనంగా డబ్బులను పంచిపెట్టిన బీఆర్ఎస్ ప్రభుత్వం చివరికి రైతు బంధును రాబడిగా మార్చిందని అంటున్నారు.. పెట్టుబడి లేని రైతు బంధుతో సంపన్నుల ఖాతాల్లో భారీగా డబ్బులు జమ అయ్యాయని ఆరోపిస్తున్నారు.
కాగా ఈ వివరాలన్నీ ధరణి పోర్టల్ లో ఉన్నాయి. వీటన్నిటినీ పరిగణనలోకి తీసుకునే రేవంత్ సర్కార్ సాగులో లేని భూములకు రైతు బంధు ఉండదని స్పష్టం చేసినట్లు వెల్లడిస్తున్నారు. సెలబ్రిటీలను, బడా రైతులను, తదితరులను మినహాయించి చిన్న, సన్నకారు రైతులకు, సాగులో ఉన్న భూములకు మాత్రమే రైతు భరోసా అందించాలనే ఆలోచనలో రేవంత్ సర్కార్ ఉన్నట్లు తెలుస్తోంది.