సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) రేపు ఢిల్లీ (Delhi) వెళ్లనున్నారు. హస్తినలో పార్టీ హైకమాండ్‌ను ఆయన కలవనున్నారు. లోక్ సభ ఎన్నికలు, ఎమ్మెల్సీ పోలింగ్, నామినేటెడ్ పదవులపై పార్టీ పెద్దలతో ఆయన భేటీ అవుతారు. మరోవైపు తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దీపాదాస్ మున్షికి కూడా హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది.
దీపాదాస్ మున్షి కూడా ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అవుతారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. తెలంగాణ రాజకీయ పరిస్థితులపై రేవంత్ రెడ్డి, దీపా దాస్ మున్షిలతో హైకమాండ్ చర్చించనుంది.
సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతపై పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించే సమావేశంలో చర్చించనున్నారు. అటు నామినేటెడ్ పదవుల భర్తీపై పార్టీ ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి, తెలంగాణ ఇం ఛార్జ్ దీపాదాస్ మున్షీతో చర్చిస్తారని తెలుస్తోంది. ఇక కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి నిన్న సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.
అనంతరం ఈ రోజు ఆయన ఢిల్లీకి వెళ్లారు. జగ్గా రెడ్డి కూడా హైకమాండ్ తో భేటీ అవుతారని తెలుస్తోంది. దీంతో ఆ భేటీ పై ఆసక్తి నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో విజిలెన్స్, జ్యుడిషీయల్ విచారణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీకి వెళ్లడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.