రాష్ట్రంలో రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రభుత్వం కొలువు దీరడంతో.. గత ప్రభుత్వ హయాంలో అతిగా ప్రవర్తించిన అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెడుతోన్నాయనే టాక్ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తోంది. ఇప్పటికే పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం కీలక పోస్టుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నదనే చర్చ మొదలైంది. దీంతో గత బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వానికి అంటకాగిన కొందరు సీనియర్ బ్యూరోక్రాట్ల పోస్టింగ్ అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది..
ఈ క్రమంలో మిషన్ భగీరథ (Mission Bhagiratha) స్కీమ్‌తో పాటు గ్రామీణాభివృద్ధి లాంటి అంశాలలో సీఎంఓ తరఫున బాధ్యతలు నిర్వర్తించిన స్మితా సభర్వాల్ పోస్టింగ్ పై సస్పెన్స్ నెలకొంది. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆమెను ఎక్కడకు బదిలీ చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు మున్సిపల్ శాఖకు అన్నీ తానై వ్యవహరించిన అరవింద్ కుమార్ ఇకపైన లూప్‌లైన్‌లోకి వెళ్ళక తప్పదనే టాక్ వినిపిస్తోంది.
దాదాపు పడేండ్లుగా ఐటీ, పరిశ్రమల శాఖకు కార్యదర్శిగా వ్యవహరించిన ప్రస్తుత స్పెషల్ సీఎస్ జయేశ్ రంజన్ విషయంపై సైతం సచివాలయం సర్కిళ్లలో చర్చలు జరుగుతోన్నట్టు సమాచారం. ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (IT Minister Duddilla Sridhar Babu) నిన్న నిర్వహించిన సమావేశంలో ఐటీ శాఖకు సంబంధించిన అంశాలపై రివ్యూ చేశారు. అయితే సరైన సమాచారం ఇవ్వడంలో అధికారులు తడబడటంతో మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఆయనను కూడా లూప్‌లైన్‌లోకి బదిలీ చేయవచ్చన్న వార్తలు మొదలైయ్యాయి..
మరోవైపు జలమండలికి దీర్ఘకాలంగా ఎండీగా వ్యవహరించిన దానకిషోర్, వ్యవసాయ శాఖకు కార్యదర్శిగా, కమిషనర్‌గా వ్యవహరిస్తున్న రఘునందన్‌రావు, ప్రస్తుతం రెవెన్యూ శాఖకు ముఖ్య కార్యదర్శిగా ఉన్న నవీన్ మిట్టల్ తదితరుల విషయంలో కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకొనున్నట్టు వార్తలు వినిపిస్తోన్నాయి. అయితే వీరు లూప్ లైన్ లో ఉంటారా? లేదా అనేది తేలాల్సి ఉంది.
ఇప్పటికే అధికారుల బదిలీలు, వారి పోస్టింగ్ పై దూకుడుగా వ్యవహరిస్తోన్న సీఎం రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వంలో నియమించబడిన సీఎస్ శాంతికుమారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకొంటారో అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు డీజీపీ అంజనీ కుమార్ పై సీఈసీ సస్పెన్షన్ ఎత్తివేసింది. దీంతో సీఎస్, డీజీపీ పోస్టులను యధావిథిగా కొనసాగిస్తారా? లేక వారి స్థానంలో కొత్తవారిని నియమిస్తారా? అనేది ఆసక్తిగా మారింది.
గత ప్రభుత్వ వైఫల్యాలు, అవకతవకలు, అవినీతి ఆరోపణలను దృష్టిలో పెట్టుకుని మంత్రులకు సైతం వ్యూహాత్మకంగా బాధ్యతలు అప్పజెప్పిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. తన పాలనకి మచ్చ అంటుకోకుండా చూసుకొంటున్నట్టు తెలుస్తోంది. ప్రతిపక్షాల మాటల దాడులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ.. రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్న ఆశ్చర్యపోవలసిన అవసరం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు..