భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు(P.V.Narsimharao) కీర్తిని పెంచేలా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) పనిచేస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. పీవీ నర్సింహారావు 19 వర్థంతి సందర్భంగా శనివారం హైదరాబాద్ (Hyderabad)లోని నెక్లెస్ రోడ్‌లోని పీవీ జ్ఞానభూమి వద్ద సీఎంతో పాటు గవర్నర్(Governor) తమిళిసై(Tamilisai) నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రధానిగా పీవీ చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. దేశ కీర్తిని ప్రపంచానికి చాటిచెప్పిన గొప్ప మేధావి పీవీ అని కొనియాడారు. పరిపాలనలో సమూల మార్పులు తెచ్చి దర్శంగా నిలిచారన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ మారినప్పుడు ఆయన తీసుకున్న సాహసోపేతాలు నేటి పాలనా వ్యవస్థకు ఆదర్శంగా నిలిచాయని చెప్పారు.
అప్పుల పాలైనప్పుడు ఏం చేయాలో పీవీ చెప్పిన మాటలను సీఎం గుర్తుచేశారు. తెలివైన వాడు సగం ఆస్తిని కుదువపెట్టి అయినా సరే మిగతా ఆస్తిని కాపాడుకుంటారని పీవీ చెప్పారనే విషయాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అదేవిధంగా పేదవాడికి భూమిని పంచడానికి పీవీ బలమైన పునాదులు వేశారని చెప్పారు.
పీవీ మన మధ్య లేకపోయినా ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు నేటికీ ఆచరణీయమన్నారు. పీవీ ఘాట్, జైపాల్‌రెడ్డి ఘాట్‌లను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని చెప్పుకొచ్చారు. వీరిద్దరూ తెలంగాణకు లంకె బిందెల్లాంటివారని సీఎం రేవంత్‌రెడ్డి అభివర్ణించారు.