పోటీ, సవాళ్లు (Challenges) మన జీవితంలో ప్రేరణగా పనిచేస్తాయని ప్రధాని మోడీ (PM Modi) తెలిపారు. పోటీ (Competition) లేని జీవితం ఆశ లేని జీవితం లాంటిదని వెల్లడించారు. అయితే పోటీ అనేది ఎప్పుడూ ఆరోగ్యకరంగా ఉండాలని అన్నారు. మీ పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చ వద్దని తల్లిదండ్రులకు ప్రధాని మోడీ సూచించారు.
ప్రతి ఏడాది పరీక్షల సమయంలో విద్యార్థుల్లో ఒత్తిడిని దూరం చేసేందుకు ప్రధాని మోడీ ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది కూడా పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ….. గతంతో పోలిస్తే ఇప్పడు విద్యార్థుల్లో చాలా సృజనాత్మకత పెరిగిందని తెలిపారు. అందువల్ల ఈ కార్యక్రమం తనకు ఓ పరీక్షలాంటిదన్నారు.
పిల్లల రిపోర్ట్ కార్డులను తల్లిదండ్రులు విజిటింగ్ కార్డులుగా పరిగణించవద్దని సూచనలు చేశారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య సంబంధం మొదటి రోజు నుండి ప్రారంభం కావాలన్నారు. తద్వారా పరీక్ష రోజు విద్యార్థులపై ఒత్తిడి ఉండబోదని తెలిపారు. పిల్లలను ఒకరితో మరొకరిని పోల్చవద్దని సూచించారు. అలా చేస్తే అది వారి భవిష్యత్తుకు హాని కలిగించవచ్చన్నారు.
ఉపాధ్యాయులు తమ పనిని కేవలం ఉద్యోగంగా భావించకూడదని వెల్లడించారు. విద్యార్థుల జీవితాలకు సాధికారత సాధించే సాధనంగా తీసుకోవాలని సూచనలు చేశారు. కొన్నిసార్లు పిల్లలు తమ స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోతున్నామని ఒత్తిడికి లోనవుతారని చెప్పారు. ప్రిపరేషన్ సమయంలో చిన్న లక్ష్యాలను పెట్టుకుని క్రమంగా పని తీరును మెరుగుపరుచుకోవాలని సలహా ఇచ్చారు. ఈ విధంగా మీరు పరీక్షలకు ముందే పూర్తిగా సిద్ధంగా ఉంటారన్నారు.
మొబైల్ పనిచేయడానికి ఛార్జింగ్ అవసరం అయినట్లే, శరీరాన్ని రీఛార్జ్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యమన్నారు. ఎందుకంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడే మనస్సుకు కూడా ప్రశాంతంగా ఉంటుందన్నారు. దీని కోసం సరైన నిద్ర కూడా చాలా ముఖ్యమని వివరించారు. ఉపాధ్యాయులు తమ విద్యార్థులందరినీ సమానంగా చూడాలన్నారు. విద్యార్థులే భారతదేశ భవిష్యత్ రూపకర్తలు అన్నారు. మన విద్యార్థులే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతారని వెల్లడించారు.