తెలంగాణ (Telangana) బీజేపీలో గ్రూప్ రాజకీయం మొదలైనట్టు తెలుస్తోంది. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. రాజాసింగ్ బుధవారం అసెంబ్లీకి వెళ్లకపోవడం పై చర్చ మొదలైంది. మరోవైపు రాష్ట్రంలో సభాపక్ష నేత(ఎల్పీ) పదవి ఎవరికన్నది ఇంకా తేల్చలేదు బీజేపీ అధిష్టానం.. అయితే ఎల్పీ పదవిని ఇద్దరు ఎమ్మెల్యేలు ఆశిస్తున్నట్టు వార్తలు వినిపిస్తోన్నాయి..
మరోవైపు ఇద్దరు కీలక నేతలు తమ వారికే ఈ పదవి దక్కాలనే పట్టుదలతో రాజకీయం నడపడం రాష్ట్ర బీజేపీలో హాట్ టాపిక్ గా మారిందంటున్నారు.. రాష్ట్రంలో బీజేపీ (BJP)కి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉండగా.. లెజిస్లేచర్ పదవి కోసం ఓ వైపు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి (Maheshwar Reddy) కుస్తీ పడుతోన్నట్టు సమాచారం..
బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి.. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా, గతంలో ఆ పదవిని చేపట్టిన అనుభవం ఉంది. అయితే ప్రస్తుతం బీజేపీలో ఉన్న మిగతా ఆరుగురు ఎమ్మెల్యేలు మొదటిసారి ఎన్నికైన వారు కావడంతో.. ఈ పదవి కోసం రాజాసింగ్, మహేశ్వర్ రెడ్డి మధ్య పోటీ మొదలైనట్టు తెలుస్తోంది. మరోవైపు రాజాసింగ్ కోసం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (Bandi Sanjay) రంగంలోకి దిగినట్టు వార్తలు వినిపిస్తోన్నాయి.. హైకమాండ్ వద్ద తన పలుకుబడిని ఉపయోగించి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం..
మరోవైపు మహేశ్వర్ రెడ్డి కోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పావులు కడుపుతోన్నట్టు ప్రచారం.. బండి సంజయ్ ప్రయత్నాలకు చెక్ పెట్టి.. మహేశ్వర్ రెడ్డికి ఎల్పీ పదవి ఇవ్వాలని కిషన్ రెడ్డి జాతీయ నాయకత్వం ముందు తన ప్రతిపాదనలు పెట్టారనే టాక్ వినిపిస్తోంది. దీంతో ఇప్పుడు ఎల్పీ పదవి ఇటు కిషన్ రెడ్డికి అటు సంజయ్‌కి ఛాలెంజ్‌గా మారింది.