నా కుమారుడి పార్టీ ఈ ఎన్నికల్లో ఓడిపోవాలని, కాంగ్రెస్ అభ్యర్థి ఆంటో ఆంటోనీని గెలవాలని కోరుకుంటున్నట్లు కాంగ్రెస్ (Congress) సీనియర్ నేత, మాజీ కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) తరఫున కేరళ (Kerala)లోని పతనంతిట్ట (Pathanamthitta) లోక్ సభ స్థానం నుంచి తన కుమారుడు అనిల్ ఆంటోనీ (Anil Antony) బరిలోకి దిగుతున్నారని తెలిపారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ జాతీయ సమస్యలను సీరియస్గా తీసుకోవడం లేదన్న కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపణలపై ప్రశ్నించగా.. కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ ఎల్లప్పుడూ పోరాడేది వాటిపైనేనని ఆంటోనీ వెల్లడించారు. ఇండియా కూటమి ప్రతిరోజూ ముందుకు సాగుతోంది. బీజేపీ పతనమవడం ఖాయమని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.
కాగా, అనిల్ ఆంటోనీ ఇటీవల బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. అయితే ఆయన పార్టీ మారడంపై గుర్రుగా ఉన్న ఏకే ఆంటోనీ.. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాలలో ఆసక్తికరంగా మారింది..