తెలంగాణ Telangana)లో ఎన్నికలకు ఎక్కువ సమయం లేకపోవడంతో బీఆర్ఎస్ (BRS) నేతలు మాటల డోస్ పెంచినట్టు కనిపిస్తుంది. కారు గేరు టాప్ లో వేసి స్పీడ్ పెంచిన నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు.. ఇప్పటికే కాంగ్రెస్ (Congress)పై విమర్శలను సందిస్తున్న నేతలు.. మరోవైపు సమయం చిక్కినప్పుడల్లా బీజేపీ (BJP)ని కూడా ఓ ఆట ఆడుకుంటున్నారని గులాబీ కార్యకర్తలు భావిస్తున్నారు.
ఇప్పటికే ఓటర్ల నాడీని పట్టిన బీఆర్ఎస్ పలురకాల వ్యూహాలతో ముందుకు వెళ్తుందని అనుకుంటున్నారు.. ఇక కారును విజయవంతంగా గమ్యానికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నట్టు భావిస్తున్న కేటీఆర్.. తెలంగాణ ప్రజలపై సెంటిమెంట్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. తాజాగా మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు మ్యాటర్ తెరపైకి తెచ్చిన కేటీఆర్.. పీవీ నర్సింహారావు (PV Narsimha Rao)కు కాంగ్రెస్ పార్టీ చాలా అన్యాయం చేసిందని ఆరోపించారు.
ఈ చరిత్ర గురించి కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీకి ఏ మాత్రం అవగాహన లేకపోవడం నిజంగా దురదృష్టకరమని కేటీఆర్ వ్యాఖ్యానించారు. తన జీవితం కాంగ్రెస్ పార్టీకి అంకితం చేసి శ్రమించిన మానవతామూర్తిని కాంగ్రెస్ పార్టీ దారుణంగా అవమానించిందని కేటీఆర్ (KTR) ఆరోపించారు.. సిట్టింగ్ ప్రధానిగా ఉన్న పీవీ నర్సింహారావుకు 1996లో ఎంపీ టికెట్ నిరాకరించిన కాంగ్రెస్.. కనీసం ఆయన మరణించాక కూడా విలువ ఇవ్వలేదని కేటీఆర్ అన్నారు.
పీవీ నర్సింహారావు మరణించిన సమయంలో 24 అక్బర్ రోడ్డులోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలోకి కూడా ఆయన భౌతిక కాయానికి అనుమతి ఇవ్వకుండా కాంగ్రెస్ అడ్డుకుందని కేటీఆర్ ఆరోపించారు. ఈ చరిత్ర గురించి ప్రియాంక గాంధీకి అవగాహన లేకపోవడం దారుణమని తెలిపారు. పీవీ కుటుంబానికి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు..