కాంగ్రెస్ (Congress) అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ‘భారత్ న్యాయ్ యాత్ర’ (Bharat Nyay Yatra)ను జనవరి 14న చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో యాత్ర కోసం విస్తృత ఏర్పాట్లు చేసేందుకు కాంగ్రెస్ రెడీ అవుతోంది. ఈ మేరకు 14 రాష్ట్రాల పీసీసీ చీఫ్‌లు, కాంగ్రెస్ శాసన సభా పక్ష నేతలతో జనవరి 4న సమావేశాన్ని నిర్వహించనుంది.
యాత్రకు సంబంధించి ఫైనల్ రూట్ ను ఈ సమావేశంలో ఫైనల్ చేయనున్నారు. జనవరి 4న యాత్రకు సంబంధించిన లోగోను విడుదల చేయనున్నట్టు పార్టీ వర్గాలు వెల్లడించాయి. యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ ను జనవరి 8న విడుదల చేయనుంది. యాత్రకు సంబంధించిన థీమ్ సాంగ్ ను జనవరి 12న విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
భారత్ న్యాయ యాత్రలో కొంత దూరాన్ని పార్టీ నేతలు పాదయాత్ర ద్వారా వెళ్లనున్నారు. మిగిలిన దూరాన్ని వాహనాల ద్వారా కవర్ చేయనున్నారు. యాత్ర సమయంలో వివిధ వర్గాల ప్రజలను అగ్రనేత రాహుల్ గాంధీ కలుసుకోనున్నారు. వారి బాధలను యాత్ర సందర్బంగా అడిగి తెలుసుకోనున్నారు. అంతకు ముందు రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రను చేపట్టబోతున్నారి కాంగ్రెస్ ప్రకటించింది.
ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి ఈ యాత్ర మొదలువుతుందని పేర్కొంది. 14 రాష్ట్రాల్లో 85 జిల్లాల గుండా ఈ యాత్ర సాగుతుందని వెల్లడించింది. చివరకు ముంబైలో ఈ యాత్ర ముగుస్తుందని వివరించింది. గతేడాది రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను పూర్తి చేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు ఈ యాత్ర కొనసాగింది. 136 రోజుల పాటు మొత్తం 4000 కిలోమీటర్ల వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టారు.