కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ (BJP) యాత్రలు, కేంద్ర ప్రభుత్వ లబ్దిదారుల సమ్మేళనం, మహిళ స్వయం సహాయక సంఘాల సమ్మేళనాలు, యువ సమ్మేళనాలు, అయోధ్య దర్శన్, గోడ వ్రాతలు, వికసిత భారత్ సంకల్ప అంబాసిడర్ కార్యక్రమాలపై కిషన్ రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు.
ఈ నేపథ్యంలో మాట్లాడిన కేంద్రమంత్రి.. గ్రూప్-1 నోటిఫికేషన్ రాకపోవడంపై స్పందించారు. తెలంగాణ (Telangana) సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీ ప్రకారం నిన్న ఫిబ్రవరి 1 వచ్చింది.. ఈరోజు రెండో తారీఖు కూడా ముగియడానికి సిద్దంగా ఉంది. కానీ ఎన్నికల వాగ్దానంలో భాగంగా.. ఫిబ్రవరి 1వ తేదీన తెలంగాణ నిరుద్యోగ యువత కోసం కోసం గ్రూప్-1 నోటిఫికేషన్ వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది.
అదీగాక అట్టహాసంగా వార్తాపత్రికల మొదటి పేజీలో ప్రకటనలు సైతం ఇచ్చింది.. కానీ ఇంత వరకైతే నోటిఫికేషన్ రాలేదని గుర్తు చేశారు. మరోవైపు ప్రజలను మోసం చేయడంలో ఘనమైన చరిత్ర కలిగిన కాంగ్రెస్.. మరోసారి తెలంగాణ యువతను మోసం చేసిందని కిషన్ రెడ్డి మండిపడ్డారు. హామీలు ఇచ్చి నెరవేర్చకుండా మరోసారి తన నిజ స్వరూపాన్ని బయటపెట్టిందని ఆరోపించారు. నమ్మి ఓటేసిన తెలంగాణ యువతను నిట్టనిలువునా మోసం చేసిన కాంగ్రెస్ ఇతర వాగ్దానాలనూ వ్యూహాత్మకంగా దాటవేసే ప్రయత్నంలో ఉందని ఆరోపించారు..