కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ (Bakka Judson) ఏదో ఒక అంశంలో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మొన్న సచివాలయంలో 300 కోట్ల స్కామ్ జరిగిందని దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేసిన ఆయన.. తాజాగా వర్ధన్నపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ (MLA Ramesh) పై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కు ఫిర్యాదు చేశారు. ఈయన ఎమ్మెల్యేగా పోటీ చేసే సమయంలో 2014, 2018లో ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫిడవిట్ లో ఆస్తుల వివరాలు ఎలా పెరిగాయో విచారణ చేయాలని అందులో కోరారు.
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత భూ కబ్జాలు చేస్తూ అక్రమంగా ఆస్తులు సంపాదించారని.. దీనిపై ఏసీబీ డైరెక్టర్ కూడా దర్యాప్తు జరపాలని కోరారు. ప్రజలకు తాగునీటిని అందించే లక్ష్యంతో ప్రారంభించిన మిషన్ భగీరథ కార్యక్రమాన్ని వర్ధన్నపేట నియోజకవర్గంలో కూడా అమలు చేశారు. ఈ పనులకు సంబంధించిన కాంట్రాక్టర్ల నుంచి ఎమ్మెల్యే రమేశ్ భారీ మొత్తంలో కమీషన్లు తీసుకుని.. చాలా వరకు పనులు పూర్తి చేయలేదని బక్క జడ్సన్ తన ఫిర్యాదులో ఆరోపించారు.
రమేష్ పై గతంలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చాలుసార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదన్నారు జడ్సన్. అందుకే, ఆయన ఆస్తులపై విచారణ జరిపించాలని ఈడీ డైరెక్టర్ కోరారు. ఇటు వర్ధన్నపేట నుంచి గతంలో ఎమ్మెల్యేగా గెలిచిన ప్రస్తుత మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) కూడా ఇదే మాదిరిగా అక్రమంగా ఆస్తులు సంపాదించారని ఆరోపించారు జడ్సన్.