తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ప్రతిపక్ష స్థానానికి పరిమితం అయింది. ఈ సారి గులాబీకి దళితులు, గిరిజనులు ఓట్లు వేయలేదని పార్టీలో చర్చ జరుగుతోంది. మరోవైపు బీసీ ఓటు బ్యాంకును పదిలం చేసుకోవడానికి వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోందని తెలుస్తోంది. అందులో భాగంగానే కవిత (Kavitha) తరచూ బీసీల అంశాలపై స్పందిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది.
అయితే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మనుగడను మాయం చేయడానికి సీఎం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని అనుకొంటున్నారు. రాష్ట్రంలో బీజేపీ (BJP) కుదురుకోవాలంటే ఇప్పట్లో జరగని పని అని భావించిన రేవంత్.. కారును కంప్లీట్ షెడ్డుకు పంపించి, కేసీఆర్ (KCR)ను ఫామ్ హౌజ్ కు పరిమితం చేస్తే తమకు తిరుగుండదనే ఆలోచనలో ఉన్నారని అంటున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అవమానాలు భరించిన వారిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
అదీగాక ఎమ్మెల్సీ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం పేరును ప్రతిపాదించడం, నంది అవార్డుల పేరును గద్దర్ అవార్డులుగా మార్చడం ద్వారా తెలంగాణ ఉద్యమకారుల్లో రేవంత్ సర్కార్ పై మరింత నమ్మకం ఏర్పడిందని అనుకొంటున్నారు. ఇలా రేవంత్ తాజా నిర్ణయాలన్నీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) కాంగ్రెస్ (Congress) ఓటు బ్యాంకును పెంచేలా ఉపయోగపడతాయని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.
మరోవైపు తెలంగాణలో 17 లోక్ సభ స్థానాల్లో కనీసం 12 నుంచి 15 వరకు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అండ్ కో వ్యూహాలు రచిస్తోందని టాక్ వినిపిస్తోంది.. ఈ నయా ప్లాన్ లో భాగంగా సాధ్యమైనంత మందిని బీఆర్ఎస్ లోని మాజీ ఎమ్మెల్యేలు, అసంతృప్తులు, ద్వితీయ శ్రేణి నేతలు హస్తం చేయందుకొనేలా ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలను అవిశ్వాసాల ద్వారా కైవసం చేసుకొంటున్నది.
ఇక ఆపరేషన్ ఆకర్ష్ పూర్తి స్థాయిలో స్టార్ కావాలంటే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే రూట్ మ్యాప్ గా మారనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలంటే బీఆర్ఎస్ ను చీల్చక తప్పని పరిస్థితి.. అలాగే అధికారంలో లేని బీఆర్ఎస్ ఐదేళ్లు పార్టీని కాపాడుకోవడం కూడా తలకు మించిన పనే అవుతుంది. ఏది ఏమైనా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత మాత్రం తెలంగాణ రాజకీయాల్లో చాలా మార్పులు సంభవించడం ఖాయం అంటున్నారు విశ్లేషకులు..