తెలంగాణ (Telangana) రాజకీయం ఆస్తులు.. అప్పులు.. గత ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు, ప్రత్యారోపణలతో ఆసక్తిగా మారింది.. రాష్ట్రాన్ని ప్రస్తుతం ఉన్న పరిస్థితి నుంచి ఎలా బయటపడ వేయాలి అనే ప్రణాళికలకు పదును పెడుతోన్న రేవంత్ సర్కారు (Revanth Govt)కి.. లీకుల బెడద గట్టిగా పట్టుకొన్నట్టు తెలుస్తోంది. కొంతమంది అధికారుల నుంచి లీకవుతున్న సమాచారం.. విపక్షాలకు ఆయుధంగా మారుతోందనే టాక్ వినిపిస్తోంది.
ఈ లీకుల వ్యవహారం ప్రభుత్వాన్ని ఇబ్బందికరంగా మారినట్టు తెలుస్తోంది. అసెంబ్లీలో శ్వేతపత్రాలను ప్రవేశపెట్టకముందే.. వాటికి విపక్ష సభ్యులు అంశాలవారీగా కౌంటర్ సిద్ధం చేయడంతో ప్రభుత్వం ఈ అనుమానానికి వచ్చినట్టు తెలుస్తోంది. అదీగాక శ్వేతపత్రాలను ఎవరితో చేయించారు అన్న సమాచారం కూడా ప్రతిపక్షాలకు చేరిందనే సమాచారం రేవంత్ సర్కార్ ని కలవరపెడుతోన్నట్టు తెలుస్తోంది..
ఈ నెల 7న రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ (Congress).. అదేరోజు తొలి మంత్రివర్గ సమావేశం జరిగింది. ఆ కేబినెట్ మీటింగ్‌లో సీఎం ఏం మాట్లాడారు? మంత్రులు ఏం చెప్పారు అనే మొత్తం సమాచారం బయటకు పొక్కినట్టు వార్తలు వినిపిస్తున్నాయి.. కేబినెట్ భేటీ తర్వాత ధరణితో పాటు డ్రగ్స్‌పై సమీక్షల్లో ఏం జరిగిందనే వివరాలు కూడా లీకయినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇలా ప్రతి అంశంపై లీకులు జరుగుతుండటం.. ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. దీంతో ఆ సమాచారాన్ని ఎవరు లీక్ చేస్తున్నారనే విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది.
ఇందులో భాగంగా గత ప్రభుత్వంతో సన్నిహితంగా మెదిలిన సిబ్బందిపై నిఘా పెట్టాలని రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని తెలుస్తోంది. మరోవైపు నివేదికలు, సమీక్షల్లో అంతర్గతంగా చర్చించిన అంశాలు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి హెచ్చరించినట్టు తెలుస్తోంది. అదే అంశాన్ని అన్ని ప్రభుత్వ శాఖల హెచ్‌వోడీలకు స్పష్టం చేసినట్లు సమాచారం. మరి ఇప్పటికైనా ఈ లీకుల బెడదనుంచి టీ కాంగ్రెస్ గట్టెక్కి.. ప్రతిపక్షాలని ధీటుగా ఎదుర్కొంటుందా? లేదా అనేది రాష్ట్రంలో కీలకంగా మారింది..