తెలంగాణలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. రాత్రికి రాత్రే నేతల కండువాల రంగులు మారుతున్నాయి. పార్టీ అధినాయకత్వంపై అసంతృప్తితో, కోపంతో జంపింగ్ జపాంగ్‌ల్లా కొందరు నేతలు మారుతున్నారు. ఎన్నికలకు పట్టుమని 13 రోజులు కూడా లేవు. అయినా నేతల వలసలు మాత్రం ఆగడం లేదు. మరోవైపు గెలుపే లక్ష్యంగా నేతలు సీనియర్ లీడర్లను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా మారారు.
ఈ క్రమంలో మాజీ హోంమంత్రి దేవేందర్ గౌడ్ (Devender Goud)తో కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్, ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ (Madhu Yashki Goud) నేడు సమావేశమయ్యారు. ప్రస్తుతం వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ అవినీతి భాగోతం అంటూ కొత్త రాజకీయ సినిమాని తెరపైకి తీసుకొచ్చింది.
అదీగాక అధిష్టానం సూచనల మేరకు రాష్ట్రంలో పట్టున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించడమే కాకుండా.. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలకు వలలు వేస్తున్నట్లు సమాచారం. ఇక టీడీపీ నేత దేవేందర్ గౌడ్ తో గతంలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) సైతం సమావేశమై చర్చలు జరిపారు. ఈ ఏడాది జులై 18న దేవేందర్ గౌడ్‌తో పాటు ఆయన తనయులు వీరేందర్ గౌడ్, విజయేందర్ గౌడ్లను రేవంత్ కలుసుకున్నారు.
ఈ నేపథ్యంలో దేవేందర్ గౌడ్‌తో పాటు బీజేపీలో కొనసాగుతన్న వీరేందర్ గౌడ్ ను పార్టీలోకి రావాలని కొరినట్టు సమాచారం. ఆ సమయంలో రేవంత్ వెంట మధుయాష్కి గౌడ్, మహేశ్వర్ రెడ్డి కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. మరోసారి ఇలాంటి కీలక సమయంలో దేవేందర్ గౌడ్‌ను మధు యాష్కి కలవడం రాజకీయ వర్గాలలో చర్చకు దారితీస్తుంది. ఒకవేళ దేవేందర్ గౌడ్ కూడా కాంగ్రెస్ (Congress)లోచేరే అవకాశం ఉందని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం..