పార్లమెంట్‌లో ఎంపీలను సస్పెండ్ చేయడంపై చెలరేగిన వివాదం రోజురోజుకి ముదురుతోంది. పార్లమెంట్ (Parliament)లో బీజేపీ (BJP) వ్యవహరిస్తున్న తీరును వ్యతిరేకిస్తూ.. కాంగ్రెస్ (Congress).. ఇండియా కూటమి పార్టీల నేతృత్వంలో, రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిర్వహించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar) తెలిపారు.
పార్లమెంట్‌లో పొగ బాంబుల దాడి ఘటనను ప్రశ్నించిన ఎంపీలను సస్పెండ్ చేయడం దారుమని తెలిపిన మహేష్.. బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న విధానాలను నిరసిస్తూ ఈ కార్యక్రమం చేపట్టబోతున్నట్లు తెలిపారు. మరోవైపు పార్లమెంట్‌లో భద్రతా వైఫల్యంపై చెలరేగిన వివాదంలో ఇప్పటి వరకు మొత్తం 143 మందిపై సస్పెన్షన్ వేటు పడింది.. కాగా సస్పెండ్ అయిన ఎంపీలంతా జంతర్ మంత్ వద్ద మాక్ పార్లమెంట్ నిర్వహించిన విషయం తెలిసిందే.
మరోవైపు మహేష్ కుమార్ పార్లమెంట్‌లో జరుగుతోన్న సంఘటనలపై మండిపడ్డారు.. పార్లమెంట్ భద్రతపై ప్రశ్నిస్తే లోక్ సభ, రాజ్యసభలలో ఎంపీలను సస్పెండ్ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నట్టు తెలిపారు.. ఇందులో భాగంగా ఇండియా కూటమి రేపు దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిందని పేర్కొన్నారు..
హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్ వద్ద రేపు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కాంగ్రెస్, ఇండియా కూటమి పార్టీల ఆధ్వర్యంలో, భారీ ధర్నా చేపట్టనున్నామని మహేష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో ఇండియా కూటమితో కలిసి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు సైతం పెద్ద ఎత్తున ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపడుతారని మహేష్ కుమార్ గౌడ్ ప్రకటించారు.