అవును దేశం కళ్లు ఎర్రబడుతున్నాయ్..కండ్ల కలకతో జనం తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వర్షాలు కురవడం, వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఈ కళ్ల కలకలు విస్తృతమవుతున్నాయి.
ఇది ప్రధానంగా అడెనో వైరస్ కారణంగా వస్తోందట. బ్యాక్టీరియా,అలర్జీ కారణంగా వేగంగా వ్యాపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. స్కూళ్లు, హాస్టళ్లు,సినిమా హాళ్లు రైల్వే స్టేషన్లు..అదీ ఇదీ అని లేదు జనసమూహం ఎక్కడుంటే అక్కడ ఈ కండ్లకలక కాలు పెడుతుంది.
అలర్జీ ద్వారా వస్తే తేలికగా తగ్గిపోతుందని.. వైరస్, బ్యాక్టిరియా ద్వారా వస్తే చూపు దెబ్బతినే ప్రమాదం ఉందంటున్నారు డాక్టర్లు.ఇప్పటికే ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక,గుజరాత్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీగా కేసులు నమాదవుతున్నాయి.
మహారాష్ట్రలో జులైలో 87 వేల 761 కండ్లకలక కేసులు నమోదయ్యాయి. అడెనోవైరస్ కండ్లకలక ఈ సంవత్సరం అత్యంత ఎక్కువ కేసులను నమోదు చేస్తోంది.మహారాష్ట్ర బుల్దానాలో దాదాపు 13 వేల 550 కేసులు రికార్డయ్యాయి.
కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ఇన్ఫెక్షన్ వేగంగా విస్తరిస్తోంది. మరోవైపు.. తెలుగు రాష్ట్రాల్లో కండ్ల కలక ఆందోళన కలిగిస్తోంది. విజయనగరం జిల్లాలోనూ ప్రతిరోజూ వందలాది కేసులు నమోదవుతున్నాయి.
బీహార్లోని పాట్నాలో ఈ వారం 40 కేసులు నమోదయ్యాయి. హిమాచల్ ప్రదేశ్ నిట్ లో కండ్లకలక వ్యాప్తితో ఆఫ్లైన్ బోధనను నిలిపివేశారు. జూన్ నుంచి గుజరాత్లో 2 లక్షల 17 వేల కండ్లకలక కేసులు నమోదయ్యాయి.
ఐ ఫ్లూ సోకిన పిల్లల్ని స్కూల్ కు పంపొద్దని చత్తీస్ గఢ్ ప్రభుత్వం విద్యాశాఖ అధికారుల్ని ఆదేశించింది. ఢిల్లీ, మహారాష్ట్ర, కర్నాటకలో దాదాపు 14వేల కంటే ఎక్కువ మంది స్పందనలను స్పీకరించిన లోకల్ సర్కిల్స్.. జాతీయ సర్వే నిర్వహించాయి.
ఢిల్లీ నివాసితులలో 27 శాతం మంది వ్యాధి బారిన పడ్డారని తేలింది.ఇంట్లో ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మంది గత వారంలో కండ్లకలక బారిన పడ్డారని అధికారులు తెలిపారు.
తీవ్ర ఆందోళన కలిగిస్తోన్న కండ్లకలక ఎరుపు, దురద, విపరీతమైన చిరాకు వంటి లక్షణాలతో కేసులు నమోదవుతున్నాయి. రద్దీగా ఉండే ప్రాంతాలలో సంచరించే వారికి, కార్యాలయాలకు వెళ్లేవారికి, పిల్లలకు పింక్ ఐ వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.