ప్రపంచాన్ని మరోసారి కరోనా (Corona) భయం వెంటాడుతోంది.. ఒకవైపు వాతావరణంలో మార్పులు.. సీజనల్ వ్యాధులు.. మరోవైపు కరోనా.. జనానికి దడ పుట్టిస్తోన్నాయి. మరోవైపు కరోనా కొత్త వేరియంట్‌తో పిల్లలను అప్రమత్తంగా ఉంచాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. చిన్న పిల్లల్లో మళ్లీ కరోనా విజృంభిస్తోందని వార్తలు వస్తున్న నేపథ్యంలో చిన్న పిల్లల తల్లిదండ్రుల్లో ఆందోళన మొదలైంది.
ఇదే సమయంలో హైదరాబాద్ (Hyderabad) నిలోఫర్ ఆస్పత్రి (Niloufer Hospital)లో నమోదవుతోన్న కరోనా కేసులు కలకలం సృష్టిస్తోన్నాయి.. నిలోఫర్ ఆస్పత్రిలో ఇద్దరు చిన్నారులకు కోవిడ్ నిర్ధారణ అయినట్టు సమాచారం.. కాగా నాంపల్లిలోని నిలోఫర్ ఆస్పత్రిలో 15 నెలల చిన్నారికి కొవిడ్-19 సోకినట్టు ప్రచారం.. నాంపల్లి (Nampally) ఆగాపుర ప్రాంతానికి చెందిన 15 నెలల పాప నాలుగైదు రోజులుగా తీవ్ర జ్వరం, ఊపిరి పీల్చుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో.. తల్లిదండ్రులు నిలోఫర్ ఆస్పత్రికి తీసుకొచ్చారు.
పాప స్థితిని అనుమానించిన వైద్యులు.. కరోనా పరీక్ష చేయగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని తెలుస్తోంది.. దీంతో ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా మళ్లీ విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 328 కేసులు బయటపడటం ఆందోళన కలిగిస్తోంది..
అయితే ప్రస్తుతం దేశంలో 2,997 యాక్టివ్ కేసులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. ఇక తమిళనాడులో ఒక్కరోజులో 15 కేసులు నమోదయ్యాయని.. కరోనా మహమ్మారి కారణంగా నిన్న కేరళలో ఒకరు మృతి చెందినట్టు వైద్యాధికారులు తెలుపుచున్నారు.. మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం 19 యాక్టివ్ కేసులు ఉన్నట్టు వివరించారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కరోనా లక్షణాలు ఏవైనా ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని కోరుతున్నారు.