మాదకద్రవ్యాల నివారణలో పాఠశాలలు కీలకమని హైదరాబాద్ సీపీ శ్రీనివాస్‌రెడ్డి(CP srinivas reddy) అన్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోని పాఠశాల విద్యార్థులు, తల్లిదండ్రులకు మాదకద్రవ్యాల నివారణపై ఆదివారం ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. విద్యార్థులు సరైన దారిలో నడవడానికి ఉపాధ్యాయుల పాత్ర కీలకమన్నారు.
విద్యార్థులకు విద్యాబుద్ధులతో పాటు సమాజంలో ఎదురయ్యే మంచి, చెడులను వివరించాలని సూచించారు. విద్యార్థి కమర్షియల్ ప్రొడక్ట్‌గా కాకుండా బాధ్యాతాయుతమైన పౌరుడిగా స్కూల్స్ తీర్చిదిద్దాలన్నారు. ఎడ్యుకేషన్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ పైనే దృష్టి సారించొద్దన్నారు. మాదకద్రవ్యాల వినియోగం దేశంపై ప్రభావం చూపిస్తోందన్నారు. ఇప్పుడు పాన్ డబ్బాలోనూ మత్తుపదార్థాలు దొరికేంత పరిస్థితి వచ్చిందన్నారు.
రాష్ట్రంలో మాదకద్రవ్యాల వినియోగం చాలా వరకు పెరిగిపోయిందని.. స్కూళ్లు, కిరాణ షాపుల వరకు పాకిందన్నారు. అది స్కూల్ పిల్లలకు చేరడం ఆందోళన కలిగించే విషయమన్నారు. మత్తు పదార్థాలను సరఫరా చేసే నెట్వర్క్ చాలా పెద్దదని, 2021 నుంచి ఇప్పటి వరకు రూ.26కోట్ల విలువైన మాదకద్రవ్యాలు పట్టుబడినట్లు సీపీ తెలిపారు. మాదకద్రవ్యాల నుంచి వచ్చే డబ్బు ఉగ్రమూకలకు అందుతోందని చెప్పారు.
టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో యాంటీడ్రగ్ కిమిటీలను స్కూల్స్‌లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. విద్యార్థులను చైతన్యవంతులను చేయాల్సిన అవసరమున్నదన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన మాట్లాడుతూ.. ఇలాంటి సందర్భం వస్తుందని తానెప్పుడూ ఊహించలేదన్నారు. ప్రైవేట్ స్కూల్ టీచర్లు విద్యార్థులను ప్రవర్తనను గమనిస్తూ సరైన దారిలో వెళ్లేలా చూడాలన్నారు.