తెలంగాణ (Telangana) రాజకీయాల్లో సీపీఐ పకోడిలా మారిందని అనుకుంటున్నారు. ఒక సారి బీఆర్ఎస్ (BRS)తో పొత్తుకు పోయి ఎన్నో కలలుకన్న కామ్రేడ్స్ అక్కడ బీఆర్ఎస్ అధినేత పొమ్మనలేక పొగపెట్టి వెల్లగొట్టడంతో.. హస్తం నీడలో అయినా ఆనందంగా ఎదుగుదాం అని పొత్తుకు పోయారని జనం అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్, సీపీఐ బంధం తుమ్మచెట్టు బంకతో అంటుకున్న పేపర్ లా ఊడిపోవడంతో.. ఎవరితో పొత్తు ఏంటని ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగారు. కానీ బీఆర్ఎస్, బీజేపీ పై విమర్శలు మాత్రం ఆపడం లేదు.
హస్తం హ్యాండిచ్చిన.. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సపోర్ట్ చేస్తున్నట్టు మాట్లాడటం కనిపిస్తూనే ఉంది. ఈ క్రమంలో సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana).. బీఆర్ఎస్ పై మాటల దాడికి దిగారు. రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబానికి అహం పెరిగిపోయిందన్న నారాయణ.. ఈ అహంతోనే అధికారం కోల్పోయే దశకు చేరుకున్నారని విమర్శించారు. దొరల దౌర్జన్యాలకు విసిగిపోయిన తెలంగాణలో.. కాంగ్రెస్ పవనాలు వీస్తున్నాయని నారాయణ అన్నారు.
కల్వకుంట్ల కుటుంబానికి షేర్లు లేకుండా.. హైదరాబాద్ చుట్టుపక్కల డెవలప్మెంట్ లేదని ఎద్దేవా చేశారు నారాయణ. చివరికి కేసీఆర్ కుటుంబానికి తీగల బ్రిడ్జిలో కూడా షేర్ ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, బీజేపీ అండ చూసుకుని ఇంతలా అహాన్ని ప్రదర్శిస్తోందని నారాయణ మండిపడ్డారు. బీఆర్ఎస్ కు ఓటు వేస్తే బీజేపీకి ఓటు వేసినట్లేనని సీపీఐ నారాయణ పేర్కొన్నారు. 15 ఎకరాలతో ఫామ్ హౌస్ కట్టుకున్న కేసీఆర్.. ముఖ్యమంత్రి అయ్యాక 250 ఎకరాల వరకు కబ్జా చేశారని నారాయణ ఆరోపించారు.
దేశంలో బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి ఒక చెట్టు కింది పక్షులేనన్న నారాయణ.. ఈ మూడు పార్టీలు కలిసి డ్రామాలు చేస్తున్నారని నారాయణ ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్, ఎంఐఎంకి ఓటు వేయకుంటే మూడు పిట్టలు రాలిపోతాయని రాష్ట్రం బాగుపడుతుందని నారాయణ తెలిపారు. కమ్యూనిస్టులకు, కాంగ్రెస్ (Congress)కి ఓటు వెయ్యండి.. బీఆర్ఎస్ని గద్దె దింపండి అంటూ పిలుపునిచ్చారు..