కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ (BJP) సీనియర్ నేత ఎల్‌కే అద్వానీ (LK Advani)కి భారత దేశ అత్యున్నత పౌర పురస్కారం, భారత రత్నకు ఎంపిక చేసినట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ అంశంపై సీపీఐ జాతీయ కార్యదర్శి (CPI National Secretary) నారాయణ (Narayana) కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు మీడియాతో మాట్లాడిన ఆయన అద్వానీపై విమర్శలు చేశారు.
రామ మందిరం నిర్మాణం చేపట్టాలని అయోధ్యలో ఎల్‌కే అద్వానీ ప్రారంభించిన రథయాత్ర వల్ల.. దేశంలో చెలరేగిన మత కల్లోలాల వల్ల జరిగిన నష్టాన్ని మరచిపోయారా అని ప్రశ్నించారు. ఈ యాత్రలో గాయపడి చాలా మంది చనిపోయారని గుర్తు చేశారు. దేశంలో మత కల్లోహాలకు కారణమై జైల్లో ఉండాల్సిన అద్వానీకి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భారతరత్న ఇచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.
దేశ ప్రజలకు ప్రభుత్వం ఈ ప్రకటన ద్వారా ఏం సందేశం ఇవ్వాలనుకుంటోందని ప్రశ్నించారు. మరోవైపు త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో సీపీఐ 30-35 స్థానాల్లో దేశ వ్యాప్తంగా పోటీ చేస్తోందని స్పష్టం చేశారు. ఇండియా కూటమిలో పెద్దన్నగా ఉన్న కాంగ్రెస్ అన్ని పార్టీలను కలుపుకోవాలని సూచించారు. మరోవైపు అద్వానీకి భారతరత్న ఇవ్వడంపై అక్బరుద్దీన్ ఓవైసీ సైతం సంచలన వ్యాఖ్యలు..
అసలు ఎల్‌కే అద్వానీకి దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్న అవార్డ్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఎల్‌కే అద్వానీకి భారతరత్న దక్కడం అంటే.. ఆయన చేపట్టిన రథయాత్రలో చోటు చేసుకున్న హింసలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల సమాధుల సోపానాలు తప్ప మరేదీ లేదని వ్యాఖ్యానించారు. కాగా ప్రస్తుతం వీరు చేసిన విమర్శలు వివాదాస్పదంగా మారాయి..