తెలంగాణ విమోచన దినోత్సవం సెప్టెంబర్ 17న రిలీజ్ అయిన తెలుగు సినిమా రజాకార్ (Razakar)టీజర్.. తెలంగాణలో రాజకీయ వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. రజాకార్ టీజర్ విషయంలో బీఆర్‌ఎస్ (BRS) బీజేపీ ( BJP) మధ్య మాటల యుద్ధం కూడా జరిగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మతపరమైన ఉద్రిక్తతలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని బీఆర్‌ఎస్ ఆరోపించింది.
అయితే ఈ మూవీలో హైదరాబాద్ (Hyderabad)సంస్థానంలో అమాయక ప్రజలపై నిజాం ప్రభుత్వానికి చెందిన రజాకార్ వ్యవస్థ ఎలాంటి అకృత్యాలకు, దారుణాలకు పాల్పడిందో దర్శకుడిగా చెప్పే ప్రయత్నం చేశానని అన్నారు. వందల మంది అమాయకుల ప్రాణాలు తీసిన దమనకాండను రజాకార్ సినిమాలో చూపించబోతున్నట్టు దర్శకుడు (Director)యాటా సత్యనారాయణ (Yata Satyanarayana)తెలిపారు. మరోవైపు ఈ టీజర్ విడుదలైన తర్వాత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ( MP Bandi Sanjay Kumar) సినిమా ప్రయత్నాన్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేసారు.
ఇంతవరకు బాగానే ఉన్నా తాజాగా ఈ సినిమా విడుదలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బోర్డు ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్ ప్రాంతీయ డైరెక్టర్ ను సీపీఐ (CPI) జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) కలిశారు. ఈ మూవీ నిర్మాత.. బీజేపీ నేత అయిన గూడూరు నారాయణ రెడ్డి వాస్తవాలను వక్రీకరించి, తెలంగాణ చరిత్రకు మతం రంగులు అద్దే ప్రయత్నం చేశారంటూ నారాయణ ఫిర్యాదు ఇచ్చారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఓటర్లను వర్గీకరించే ప్రయత్నమే ఈ చిత్రం యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ సీపీఐ నారాయణ తెలిపారు. మరోవైపు ఇది మత పోరాటం కాదు.. స్వాతంత్య్ర పోరాటం. దీన్ని మతం దృష్టితో కాకుండా పోరాటం దృష్టితో చూడమని దర్శక నిర్మాతలు తెలుపుతున్నారు. ఈ గత చరిత్ర, మన చరిత్ర, మన పెద్దల చరిత్ర కాబట్టి అందరూ మంచి మనస్సుతో ఆలోచించాలని దర్శకుడు అన్నారు.