తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) జాతకం మొత్తం తిరగబడి పోయిందనే టాక్ వినిపిస్తోంది. ఎన్ని పూజలు చేసిన, యాగాలు చేసిన ఎన్నికల రిజల్ట్ మాత్రం ఆశించిన స్థాయిలో రాలేకపోయింది. అధికారంలో ఉన్నప్పుడు ధగధగలాడిన బీఆర్ఎస్.. ప్రస్తుతం కళాహీనంగా మారిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో పార్టీమీద ఆసక్తి లేనట్టు కేసీఆర్ వ్యవహరించడం చర్చకు దారితీస్తోంది.
ఇంత కాలం ప్రతిపక్షాలను నోరెత్తనీయకుండా.. ఏకఛత్రాధిపత్యంతో రాష్ట్రంలో ఎదురు లేకుండా.. అంతా తానై నడిపించిన గులాబీ బాస్.. లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్నా సైలంట్ గా ఉండటం.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. బీఆర్ఎస్ కు నష్టం ఎవరి వల్ల జరిగిన.. ప్రస్తుతం ఆ పార్టీలో ఉన్న వారి పరిస్థితి బోనులో చిక్కిన పులిలా మారిందని అనుకొంటున్నారు. అయితే ఇప్పటికీ అధికారం తమను కాదనదనే ధీమాలో కారు ఓనర్లు ప్రవర్తించడం కనిపిస్తోంది.
ఇదే సమయంలో లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections)కు బీజేపీ (BJP).. కాంగ్రెస్ (Congress) సిద్దం అవుతున్నాయి. ఆయా పార్టీ అధినేతలు ఎన్నికల్లో గెలుపు మాదంటే.. మాదని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాలనపై ప్రతిపక్ష నాయకులు విమర్శలు కురిపిస్తుంటే.. మరోవైపు అధికార పక్షం ప్రతివిమర్శలు చేస్తూ వారి వ్యాఖ్యలను తిప్పికొడుతున్న సంఘటనలు చోటు చేసుకొంటున్నాయి. ఈ క్రమంలో సీపీఐ సీనియర్ నేత రాఘవులు కీలక వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణ (Telangana) నుంచి రాబోయే లోక్సభ ఎన్నికల్లో ఎంపీ స్థానానికి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక మిగిలిన చోట్ల ఇండియా కూటమిలోని పార్టీలకు తమ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు బీజేపీతో పొత్తు అంశంపై బీఆర్ఎస్ నిశబ్ధం పాటించడం దేనికి సంకేతమని రాఘవులు (Raghavulu) ప్రశ్నించారు. వాడిపోతున్న పువ్వుకు ఎందుకు ఇంత ధీమాగా ఉందని చురకలంటించారు. కేసీఆర్ ఇప్పటికైనా ఇండియా కూటమిలోకి రావాలంటూ ఆయన సూచించారు.