హైదరాబాద్( Hyderabad) ఉమ్మడి రాజధాని గడువు పొడిగించాలంటూ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారాన్నే రేపాయి. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలకు మంత్రి బొత్స సత్యనారాయణ క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉమ్మడి రాజధాని విధానం కాదని, వైవీ వ్యాఖ్యలను వక్రీకరిస్తున్నారని బొత్స చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వైసీపీ నేతలపై విపక్షాలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నాయి. తాజాగా, వైసీపీ ఎన్నికల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ(CPI AP State Secretary K. Ramakrishna) అన్నారు.
ఎన్నికల సమీపిస్తున్నందున వైసీపీ హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పేరుతో కొత్త నాటకానికి తెరలేపారని ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏపీ రాజధానిని నిర్వీర్యం చేశారని అన్నారు.
మూడు ముక్కలాటతో రాజధాని లేని రాష్ట్రంగా మార్చారని విమర్శించారు. నాలుగున్నరేళ్లుగా హైదరాబాద్ ఊసే ఎత్తని వైసీపీ, ఇప్పుడు నిద్రలేచిందన్నారు. మరో రెండేళ్లు హైదరాబాద్ రాజధాని కావాలంటూ మరో కుట్ర చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు నాగార్జునసాగర్ డ్యాంపై హడావుడి చేసి కేసీఆర్కు లబ్ధి చేకూర్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారని ఆరోపించారు.