తెలంగాణ (Telangana) అసెంబ్లీ ఎన్నికలకు (Assembly-Elections)అభ్యర్థుల తొలి జాబితా (First List) సీపీఎం (CPM) ప్రకటించింది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితాలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది. మరో మూడు స్థానాలకు ఆదివారం సాయంత్రం అభ్యర్థులను ప్రకటించే అవకాశమున్నట్టు సమాచారం.
మరోవైపు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. ఖమ్మం జిల్లా పాలేరు నుంచి బరిలోకి దిగనున్నారని తెలిపారు. ఇక తెలంగాణ ఎన్నికల్లో ప్రతి పార్టీ దూకుడు ప్రదర్శిస్తోంది. ప్రచారంలో జోరు కూడా పెంచింది. విమర్శలే అస్త్రాలుగా పార్టీలు ముందుకి వెళ్ళుతున్నాయి. మరోవైపు పొత్తుల మీద ఆశ పెట్టుకున్న సీపీఎం ఆశలు ఆవిరవడంతో ఒంటరిగా ఎన్నికల బరిలో దిగేందుకు సిద్దమైంది.
సీపీఎం పొత్తు విషయంలో కాంగ్రెస్‌తో చివరి వరకు ప్రయత్నించిన అవి ఫలించలేదు. మిర్యాలగూడ, వైరా స్థానాలను ఇవ్వాలని గతంలో సీపీఎం కోరింది. కానీ కాంగ్రెస్ పెద్దల నుంచి ఎలాంటి స్పందన రాక పోవడంతో ఒంటరి పోరు మేలని భావించిన ఎర్రన్నలు అటువైపు అడుగులు వేశారు. ఇక సీపీఎం ప్రకటించిన అభ్యర్థుల తొలి జాబితాలో ఉన్న పేర్లను పరిశీలిస్తే..
పాలేరు నుంచి తమ్మినేని వీరభద్రం.. మిర్యాలగూడ నుంచి జూలకంటి రంగారెడ్డి.. భద్రాచలం నుంచి కారం పుల్లయ్య.. అశ్వారావుపేట నుంచి పి.అర్జున్
మధిర నుంచి పాలడుగు భాస్కర్.. వైరా నుంచి భూక్యా వీరభద్రం.. ఖమ్మం నుంచి శ్రీకాంత్.. సత్తుపల్లి నుంచి భారతి.. నకిరేకల్ నుంచి చినవెంకులు.. భువనగిరి నుంచి నర్సింహ.. జనగామ నుంచి కనకారెడ్డి.. ఇబ్రహీంపట్నం నుంచి యాదయ్య.. పటాన్‌చెరు నుంచి మల్లికార్జున్.. ముషీరాబాద్ నుంచి దశరథ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగనున్నారని సీపీఎం ప్రకటించింది.