ఎన్నికల్లో గెలవానే ఆలోచనే గాని అభ్యర్థి చరిత్ర కోసం రాజకీయ పార్టీలకు అవసరం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ఛైర్మన్ పద్మనాభరెడ్డి పేర్కొన్నారు. గెలుపు గుర్రాల వేటలో అన్ని రాజకీయ పార్టీలు నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇచ్చాయని పద్మనాభరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ప్రధాన పార్టీల తరఫున 360 మంది అభ్యర్థులు బరిలో నిలిచారని.. వారిలో 226 మందికి నేర చరిత్ర ఉందని పద్మనాభరెడ్డి పేర్కొన్నారు.
సగం మంది అభ్యర్థులపై భూ ఆక్రమణ, బెదిరింపులు, ఇతర నేరాలకు సంబంధించిన కేసులున్నాయని పద్మనాభరెడ్డి తెలిపారు. ఇందులో అత్యధికంగా రేవంత్ రెడ్డి, రాజాసింగ్‌లపై 89 చొప్పున కేసులు నమోదైనట్లు.. బండి సంజయ్‌పై 59.. ఈటెల రాజేందర్‌పై 44 .. ఖనాపూర్ కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుపై 52 కేసులు ఉన్నాయని ఆయన వెల్లడించారు.. కేసుల్లో ఉద్యమం సందర్భంగా కొన్ని, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు కొన్ని నమోదయ్యాయని వివరించారు.
మరోవైపు బీఆర్‌ఎస్ (BRS) పార్టీ నుంచి పోటీ చేస్తున్న 48 శాతం మంది అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉన్నాయన్న పద్మనాభరెడ్డి (Padmanabha Reddy)..బీజేపీ (BJP) తరఫున ఎన్నికల బరిలో నిలిచిన వారిలో 70 శాతం మంది అభ్యర్థులపై, కాంగ్రెస్ (Congress) అభ్యర్థుల్లో అత్యధికంగా 71 శాతం మందిపై, ఎంఐఎం (MIM) పార్టీ అభ్యర్థుల్లో 50 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఆయన వివరించారు.
కాగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకునే ముందు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల నేర చరిత్రను చూసి ఎన్నుకోవాలని సూచించారు.. లేదంటే ఎన్నుకోబడిన వారు బాగానే ఉంటారు.. ఓటర్లు మాత్రం సమస్యలను ఎదుర్కొన వలసి వస్తుందని పద్మనాభరెడ్డి వెల్లడించారు.