సైబర్ నేరగాళ్లు (Cyber Criminals) రోజు రోజుకు రెచ్చి పోతున్నారు.. కొత్త కొత్త దారులలో అమాయకులకు వలవేసి.. ఆశ చూపి అందినకాడికి దండుకొంటున్నారు. సైబర్ నేరాల పట్ల అధికారులు ఎంతగా అవగాహన కల్పించినప్పటికి మోసపోయే వారు మోసపోవడం కనిపిస్తుంది. తాజాగా ఒక వృద్దుడు సైబర్ నేరగాళ్లు పన్నిన వ్యూహంలో పడి రూ. 2.3 లక్షలు పోగొట్టుకొన్న ఉందంతం వెలుగులోకి వచ్చింది.
తమ వద్ద పాత రూ.2 కాయిన్స్ లేదా రూ.5 కాయిన్స్ ఉంటే తమకు ఇవ్వాలని దానికి బదులుగా లక్షల రూపాయలు చెల్లిస్తామని సైబర్ నేరగాళ్లు ఒక వీడియో క్రియేట్ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియా (Social Media) మాధ్యమాలలో ప్రసారం చేశారు. అయితే ఆ వీడియో బెంగళూరు (Bangalore)లో ఉంటున్న ఓ వృద్దుడి కంటపడింది.. వెంటనే అత్యాశకు పోయిన అతను సైబర్ నేరగాళ్లతో టచ్ లోకి వెళ్ళాడు..
1980,1990 నాటి కాలంలో చలామణి అయిన పాత కాయిన్స్ పై అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ బొమ్మతో పాటు, భారత మ్యాప్ సైతం ఉంటుంది.. ఇలాంటి కాయిన్స్ తన వద్ద ఉన్నాయని వారికి తెలిపాడు.. అయితే వాటికి అక్షరాల రూ.31 లక్షల రూపాయలు వస్తుందని సైబర్ మోసగాళ్ళు నమ్మించారు..ఈ క్రమంలో రకరకాల టాక్స్ ల పేరుతో, బాధితుడి ఖాతా నుంచి 2.3 లక్షల రూపాయలు లాగేశారు.
మరికొంత డబ్బు కావాలని నేరగాళ్లు కోరడంతో అనుమానం వచ్చిన వృద్దుడు.. డబ్బు పంపడం ఆపేసాడు. అయితే విషయాన్ని గమనించిన మోసగాళ్ళు ముంబై పోలీస్ పేరుతో ఒక ఫేక్ కాల్ చేశారు. మనీలాండరింగ్ కింద నీ మీద కేసు నమోదైందంటూ బాధితుడిని భయపెట్టారు.. వ్యవహారం ముదురుతోందని ఆందోళన చెందిన వృద్దుడు.. స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. తాను ఎలాంటి తప్పు చేయలేదని కేవలం అత్యాశకు పోయి సోషల్ మీడియాలో వీడియో చూసి డబ్బులు పోగొట్టుకున్నట్టు అధికారులకు తెలిపాడు.. కాగా ఈ ఉదంతం పై స్పందించిన పోలీసులు.. ఐటీ యాక్ట్ తో పాటు ఐపీసీ సెక్షన్ 420 కింద కేస్ నమోదు చేశారు.