బంగాళాఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుపాను(Michaung Cyclone) బలపడింది. నైరుతి బంగాళాఖాతంలో వాయువ్యదిశగా తుపాను కదులుతోంది. కోస్తా, రాయలసీమ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి 110కి.మీల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు హెచ్చరించిన సంగతి తెలిసిందే.
తుపాన్ ప్రభావంతో నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా మారింది. 1.5మీటర్ల ఎత్తున సముద్ర అలలు ఎగసిపడుతున్నాయి. విశాఖలో తెల్లవారుజాము నుంచే ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. ఈనేపథ్యంలో ఇప్పటికే విద్యాశాఖ పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. జిల్లాలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎప్ బృందాలు అప్రమత్తంగా ఉన్నాయి.
ప్రస్తుతం 55 నుంచి 75 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మరికొద్ది గంటల్లో ఈదురుగాలులు మరింత తీవ్రరూపం దాల్చనున్నాయి. తిరుమలలో తుపాను ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. బాపట్లలోని సూర్యలంక బీచ్ మూసివేశారు. సూళ్లూరుపేటలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాల వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. జిల్లాల్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేశారు.
వర్షం కారణంగా తిరుమలలో పర్యాటకులకు ఆంక్షలు విధించారు. కొండచరియలు విరిగిపడే అవకాశం ఉండడంతో పాపవినాశనం, శ్రీవారి పాదాలు, ఆకాశగంగ ప్రాంతాలకు అనుమతి నిరాకరిస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే ఘాట్‌రోడ్డుపై పలు చోట్ల కొండచరియలు విరిగిపడగా వాటిని సిబ్బంది తొలగిస్తున్నారు. తిరుపతి జిల్లాలో స్వర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
లంకమిట్ట వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. అటు నెల్లూరు జిల్లా, కోనసీమ, కాకినాడ తీరంలో ఈదురుగాలులు, భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆరబెట్టిన ధాన్యం నిల్వలు వర్షంలో తడవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని డొంకూరు తీరంలో చేపలవేటకు వెళ్లిన ఓ మత్స్యకారుడు గల్లంతైనట్లు సమాచారం.
తుపాను సహాయ చర్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు సూచించారు. రైతులకు నష్టాన్ని నివారించేలా తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. తుపాను బాధితులకు కార్యకర్తలు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. మరోవైపు, తుపాను ప్రభావంతో నారా లోకేశ్ యువగళం పాదయాత్ర వాయిదాపడింది.