అయోధ్య(Ayodhya)లో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠాపన నేపథ్యంలో ఏపీలో ఈనెల 22న సెలవు ప్రకటించాలని బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి(Daggubati Purandeswari) డిమాండ్ చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రామ మందిరం ప్రారంభం భారతీయుల శతాబ్దాల కల అని, దశాబ్దాల పోరాటమని వ్యాఖ్యానించారు.
ఇప్పటికే ఏపీలో సంక్రాంతి సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఈ నెల 22న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి.. అయితే, ఏపీలో 21వ తేదీ వరకు మాత్రమే సెలవు ప్రకటించారు.
22వ తేదీన దేశమంతా రామజపం చేస్తూ దాదాపు అన్ని రాష్ట్రాల్లో విద్యా సంస్థలు సెలవు ప్రకటించాయి. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ఆ రోజు సెలవు ప్రకటించలేదని పురంధేశ్వరి దుయ్యబట్టారు. ఈ నెల 22వ తేదీన బాలరాముని విగ్రహ ప్రతిష్ట నిర్వహించబోతుంట.. 21వ తేదీ వరకు మాత్రమే జగన్ ప్రభుత్వం సెలవులు ఇవ్వడం వెనక దురుద్దేశం ఉందని అర్థం అవుతుందని విమర్శించారు.
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ వల్ల 21వ తేదీ వరకు సెలవు ఇవ్వడాన్ని బీజేపీ పక్షాన హర్షం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అన్ని వర్గాల వారికి మోడీ చేయూతను ఇచ్చారని తెలిపారు. అయితే, 22న బాలరాముని ప్రతిష్ఠాపనను వీక్షించేందుకు దేశ ప్రజలంతా ఎదురు చూస్తోందని వెల్లడించారు.