చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు చాక్లెట్‌ని ఇష్టపడతారన్న విషయం తెలిసిందే.. అయితే చాక్లెట్లు కూడా దీర్ఘకాలంలో అనారోగ్యానికి గురిచేస్తాయని నిపుణుల హెచ్చరికలు గుర్తుంచుకోవలసిన అవసరం ఉంది.. అదీగాక పలు సందర్భాలలో వీటిలో పురుగులు కూడా కనిపించడం గమనించవలసిన విషయం.. అయితే తాజాగా ఇలాంటి సంఘటనే ఓ వినియోగదారుడికి ఎదురైంది.
హైదరాబాద్ (Hyderabad), అమీర్ పేట్ (Ameerpet)లో జరిగిన ఈ ఘటనను సదరు వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ (X)లో పోస్ట్ చేశాడు. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నగరంలోని ఓ సూపర్ మార్కెట్‌లో కొనుగోలు చేసిన డైరీ మిల్క్ చాక్లెట్ (Dairy Milk Chocolate)లో చిన్న పురుగు చాక్లెట్ రంగులోకి మారి తిరుగుతోంది. అది చూడగానే షాకైనా ఆ వ్యక్తి.. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
అమీర్‌పేట మెట్రో స్టేషన్‌లోని రత్నదీప్ సూపర్‌మార్కెట్‌లో ఈ చాక్లెట్ కొనుగోలు చేశానని, దానికి సంబంధించిన బిల్లును కూడా జత చేశానని చెప్పాడు. డెయిరీ మిల్క్ చాక్లెట్‌లో పురుగులు ఉండటంపై క్యాడ్‌బరీ సంస్థ అధికారిక ఎక్స్ అకౌంట్ ద్వారా స్పందించింది. వినియోగదారుడికి చెడు అనుభవం ఎదురైనందుకు చింతిస్తున్నాం. ఘటనపై దర్యాప్తు చేస్తాం. మరొసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటాం అని పోస్ట్ చేసింది.
మరోవైపు జీహెచ్‌ఎంసీ కూడా స్పందించింది. ఈ ఘటనపై సంబంధిత ఫుడ్ సేఫ్టీ టీమ్‌కు ఫిర్యాదు చేశామని, వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని తెలిపింది. కాగా ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. క్షణాల్లో 85 వేల మంది ఈ పోస్ట్‌ని చూసి.. క్యాడ్‌బరీ సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దావా వేసి, పరిహారం పొందాలని సూచించారు.