తెలంగాణ (Telangana) ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ (KCR) అధికారంలోకి వచ్చాక మోసం చేశారని ఇప్పటికే ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.. మరోవైపు బీజేపీ (BJP) అధికారంలోకి వస్తే బీసీ (BC)కి ముఖ్యమంత్రి పదవి ఇస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా(Amit Shah) ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా మాటలపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ (Dasoju Sravan) విమర్శలు చేశారు.
ప్రాణం లేని పాముకు పాలు పోసిన బ్రతుకుతుందా.. అలాగే బీజేపీ తెలంగాణలో దాదాపు చచ్చిపోయినప్పటికీ అమిత షా ఆక్సిజన్ అందించడానికి ప్రయత్నిస్తున్నారని దాసోజు శ్రవణ్ ఎద్దేవా చేశారు. బీసీ ముఖ్యమంత్రి అనే బూటకపు నినాదాన్ని పునరుద్ధరించేందుకు అమిత్ షా విఫలయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు బీసీల గురించి ఆలోచించని బీజేపీ.. ఎన్నికల సమయంలో బీసీ నినాదం చేయడం విడ్డూరమని దాసోజు శ్రవణ్ విమర్శించారు.
ఇప్పటి వరకు బీసీ కుల గణనను ఎందుకు నిర్వహించలేక పోతున్నారని, బీజేపీ BC నాయకుడుని ఊచకోత కోసి, రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించి, ఫార్వర్డ్ క్లాస్ లీడర్‌ను ఎందుకు నియమించారని దాసోజు ప్రశ్నించారు. సీఎం అభ్యర్థిగా బీసీ నాయకుడిని చేస్తామని అంటున్నారు కదా ముందు నా ప్రశ్నలకి సమాధానం చెప్పండని దాసోజు శ్రవణ్ అన్నారు.. మీ చేతలలో తెలుస్తుంది మీకు OBCల పట్ల ఎంత సానుభూతి ఉందో అని వ్యంగ్యంగా మాట్లాడారు దాసోజు శ్రవణ్.
బీజేపీ తెలంగాణ ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తే అది పగటి కలగానే మిగిలిపోతుందని, అమిత్ షా కపటత్వాన్ని, కుట్రను తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోగలరని శ్రవణ్ అన్నారు. భారతదేశంలోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్‌లు, యూనివర్శిటీలలో నిర్వహించే రిక్రూట్‌మెంట్లలో OBC రిజర్వేషన్లు ఎందుకు అమలు చేయబడటం లేదని, OBCలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించమని అంటున్నా బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదని దాసోజు శ్రవణ్ ప్రశ్నల వర్షం కురిపించారు.. వీటన్నింటికీ సమాధానం చెప్పలేని మీకు తెలంగాణలో ఓట్లు అడిగే అర్హత లేదని దాసోజు శ్రవణ్ మండిపడ్డారు..
			        
			        
														