ఈ మధ్య పలువురు హీరోలు, హీరోయిన్లు పెళ్లి బాట పడుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా బ్యాచిలర్స్ గా ఉన్న వారు జంటగా మారుతున్నారు.. అయితే అలా పెళ్లి బాట పట్టిన హీరోలు హీరోయిన్లు ఇప్పుడు ఒక్కరొక్కరు తల్లిదండ్రులుగా ప్రమోషన్స్ పొందుతున్నారు. ఈ క్రమంలో తాజాగా దీపికా పదుకొనే (Deepika Padukone) తన అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు.
తాజాగా సోషల్ మీడియా వేదికగా దీపికా పదుకొనే ఒక ఫోటో షేర్ చేశారు. అందులో సెప్టెంబర్ 2024 అని పేర్కొంటూ దీపిక అలాగే రణవీర్ (Ranveer) అని రాసి ఉంది. ఆ ఫోటో చుట్టూ చిన్న పిల్లలకు సంబంధించిన బట్టలు, చెప్పులు, షూస్ ఉన్నాయి. దీంతో ఆమె తల్లి కాబోతున్నట్లు ప్రకటించిందని అభిమానులు సంబరపడుతున్నారు.. మరోవైపు దీపికా తల్లి కాబోతుందంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వైరల్ అవుతున్నాయి..
ఇక దీపికా పదుకొణె ఇన్స్టాగ్రామ్ పోస్ట్ చూసిన ఫ్యాన్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోవైపు BAFTA అవార్డ్స్ 2024లో దీపిక చీర కట్టులో కనిపించినప్పుడు, అభిమానులు ఆమె బేబీ బంప్‌ని గమనించారు. ఆ సమయంలో ఆమె సబ్యసాచి వెండి సేక్విన్ చీరను ధరించారు. ఇందులో ఆమె తన బేబీ బంప్‌ను దాచిపెట్టే ప్రయత్నాలు చేస్తూ కనిపించిందనే ప్రచారం జరిగింది.
ఇదిలా ఉండగా బాలీవుడ్ స్టార్ కపుల్స్ ప్రేమకథ రామ్‌లీలా (Ramlila) సినిమా సెట్స్‌లోనే మొదలైంది. వారు 2012 లో డేటింగ్ ప్రారంభించారు. ఆ తర్వాత 2018లో ఇటలీ (Italy), లేక్ కోమో (Lake Como)లో ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకొన్నారు. అయితే వీరికి పెళ్లయి 5 ఏళ్ళు అవుతున్న..ఇంతవరకు పిల్లలు లేకపోవడంతో తరుచూ ప్రశ్నలు ఎదుర్కుంటూ వస్తున్నారు. ఇక వీరి తర్వాత మ్యారేజ్ చేసుకొన్న రణ్‌బీర్, ఆలియా ఇప్పటికే పేరెంట్స్ స్టేటస్ పొందడం తెలిసిందే..