Telugu News » Kaleswaram : ఆలస్యం.. అమృతం.. విషం..!

Kaleswaram : ఆలస్యం.. అమృతం.. విషం..!

మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరిపిన ప్రభుత్వం.. మిగిలిన అవినీతిపై ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంది. జ్యుడీషియల్ ఎంక్వైరీ అంటోంది కానీ, అదిగో ఇదిగో అంటూ ఆలస్యమవుతోంది. విజిలెన్స్ విచారణలోనే కీలక ఫైళ్లు మాయమయ్యాయని గుర్తించారు. జ్యుడీషియల్ విచారణ జరిగే సమయానికి ఇంకేం జరుగుతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

by admin

– మేడిగడ్డ వరకే పరిమితమైన విజిలెన్స్ సోదాలు
– మూడు రోజులపాటు సాగిన తనిఖీలు
– కీలక ఫైళ్లు మాయం అయినట్టు అనుమానాలు
– కొన్ని రికార్డుల స్వాధీనం
– మేడిగడ్డ సరే.. ఓవరాల్ కాళేశ్వరం సంగతేంటి?
– జ్యుడీషియల్ ఎంక్వైరీ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
– రేవంత్ సర్కార్ మాటలకే పరిమితమా?
– బీజేపీ అంటున్నట్టు తెర వెనుక డ్రామానా?

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన మేడిగడ్డ వ్యవహారాన్ని తేల్చేందుకు వరుసగా మూడవ రోజు కూడా విజిలెన్స్ తనిఖీలు కొనసాగాయి. మహదేవ్ పూర్ నీటి పారుదల శాఖ కార్యాలయంలో విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు సోదాలు చేశారు. మొత్తం పది మంది ఈ సోదాల్లో పాల్గొన్నారు. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ, కన్నెపల్లి లక్ష్మీ పంపు హౌస్‌ లకు సంబందించిన కీలక పత్రాలను పరిశీలించారు. అనంతరం వాటిని సీజ్ చేశారు. ఈ సోదాల్లో కీలక రికార్డులు, హార్డ్ డిస్క్‌ లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటిని హైదరాబాద్ కు తరలిస్తున్నారు. ఇప్పుడు సోదాలు ముగియడంతో నెక్స్ట్ ఏం చేయనున్నారనే చర్చ జరుగుతోంది.

the telangana government will conduct an inquiry into the construction of the kaleshwaram project

వాట్ నెక్ట్స్..

మేడిగడ్డ కుంగుబాటుకు గురి కావడంతో పాటు ప్రాజెక్టుకు ఆయువు పట్టుగా నిలిచిన ఈ బ్యారేజీకి సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ప్రభుత్వం విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. విజిలెన్స్ విభాగంలో ఉండే ఇంజనీరింగ్ అధికారుల సూచనల మేరకు ఫైళ్లను ఆధారం చేసుకుని స్టేజ్ వైజ్ గా విశ్లేషణ చేయనున్నారు. ప్రపోజల్స్ నుండి చెక్ మేజర్ వరకు జరిగిన ప్రక్రియకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేయనున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాణ దశలో నిపుణుల సలహాలు ఎలా తీసుకున్నారు, సాంకేతికపరంగా ఎదురైన ఇబ్బందులు ఏంటి..? వాటిని అధిగమించేందుకు తీసుకున్న చొరవ ఏంటి? అన్న అంశాలపై కులంకశంగా పరిశీలించనున్నారు.

ఫిజికల్ ఎంక్వైరీ ఎప్పటినుంచి?

మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన రికార్డులను పూర్తి స్థాయిలో పరిశోధించిన తర్వాత ఒక నివేదిక తయారు చేసుకుని విజిలెన్స్ అధికారులు ఫిల్డ్ విచారణ చేపట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. పిల్లర్ల వారీగా అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకుని రిపోర్టును ఆధారం చేసుకుంటూ క్షేత్ర స్థాయి విచారణ జరపనున్నారు. కాంక్రీట్ వినియోగం, స్టీల్ యూజింగ్ తో పాటు క్యూరింగ్ తదితర అంశాల గురించి ప్రాక్టికల్ గా విచారించనున్నారు. పిల్లర్ల కుంగుబాటుకు కారణం ఏంటి..? ఇక్కడ చేపట్టిన నిర్మాణాల్లో లోపాలు, ఇతర పిల్లర్ల విషయంలో తీసుకున్న జాగ్రత్తలపై అధ్యయనం చేయనున్నారు. నిరంతరం నీటి ప్రవాహం ఉండే అవకాశాలు ఉన్నందున వరద ఉద్ధృతిని ఏ విధంగా అంచనా వేసి నిర్మాణాలు జరిపారు? దీనికోసం తీసుకున్న ప్రపోజల్స్.. ఇలా అన్ని వివరాలపై కూడా విజిలెన్స్ అధికారులు తెలుసుకునే అవకాశం ఉంది. రికార్డుల పరిశీలన, క్షేత్ర స్థాయి అధ్యయనం తరువాత సమగ్రమైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి అందించనున్నారు. దీనివల్ల బ్యారేజీ నిర్మాణానికి సంబంధించిన లోతుపాతులను గుర్తించే అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది.

మేడిగడ్డ సరే.. కాళేశ్వరం అవినీతి సంగతేంటి..?

ఎన్నికల సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని కాంగ్రెస్ పదేపదే చెప్పింది. ప్రజలు కూడా దీన్ని నమ్మారు. అందుకే, కేసీఆర్ ను కాదని హస్తం పార్టీకి ఓట్లు గుద్దారు. చివరకు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇచ్చిన హామీ ప్రకారం కాళేశ్వరం లెక్కలన్నీ తేలుస్తామని చెప్పింది. జ్యుడీషియల్ ఎంక్వైరీ చేయిస్తామని ప్రకటించింది. మేడిగడ్డపై విజిలెన్స్ విచారణ జరిపిన ప్రభుత్వం.. మిగిలిన అవినీతిపై ప్రస్తుతానికి సైలెంట్ గా ఉంది. జ్యుడీషియల్ ఎంక్వైరీ అంటోంది కానీ, అదిగో ఇదిగో అంటూ ఆలస్యమవుతోంది. విజిలెన్స్ విచారణలోనే కీలక ఫైళ్లు మాయమయ్యాయని గుర్తించారు. జ్యుడీషియల్ విచారణ జరిగే సమయానికి ఇంకేం జరుగుతుందో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

సీబీఐ విచారణకు బీజేపీ డిమాండ్

కాళేశ్వరంలో జరిగిన అవకతవకలను నిగ్గు తేల్చాలంటే సీబీఐకి విచారణ బాధ్యత అప్పగించాలని అంటోంది బీజేపీ. కేవలం బ్యారేజీల వరకే పరిమితం చేస్తూ జ్యుడీషియల్ విచారణ చేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తోంది. అలా కాకుండా ప్రాజెక్టు మొత్తంలో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో వెలికి తీయాలంటే సీబీఐ విచారణకు ప్రభుత్వం ముందుకు రావాలని కమలనాథులు డిమాండ్ చేస్తున్నారు. కాలయాపన కోసమే జ్యుడీషియల్ ఎంక్వైరీ అంటున్నారని.. బీఆర్ఎస్ ను కాపాడేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని విమర్శల దాడి చేస్తున్నారు.

You may also like

Leave a Comment