దేశ రాజధాని ఢిల్లీలో వాయుకాలుష్యం (Air Pollution) విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో.. ఢిల్లీ (Delhi) ప్రభుత్వం నవంబర్ 9 నుంచి 18 వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే.. అయితే ప్రస్తుతం గాలి నాణ్యత మెరుగుపడిన క్రమంలో నేటి నుంచి పాఠశాలలు (schools) తెరవాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలలు తెరుచుకుంటాయని వెల్లడించింది.
కొన్ని ప్రైవేట్ పాఠశాలలు మాత్రం నర్సరీ నుండి ఐదో తరగతి చదివే పిల్లలకు సెలవులను కంటిన్యూ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఢిల్లీలో కాలుష్యం ఇంకా బ్యాడ్ కేటగిరీలోనే ఉందని, అందుకే చిన్న పిల్లల ఆరోగ్యంపై వాయు కాలుష్య ప్రభావం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రైవేట్ పాఠశాల సిబ్బంది తెలుపుతున్నారు..
మరోవైపు నర్సరీ నుంచి 12వ తరగతి వరకు అన్ని తరగతులు ఫిజికల్ మోడ్‌లో నిర్వహించాలని అధికారులు నిర్ణయించినట్టు తెలిపారు.. పాఠశాలల్లో ఉదయం ప్రార్థనలు, బహిరంగ కార్యక్రమాలపై వారం రోజుల పాటు నిషేధం ఉంటుందని విద్యాశాఖ డైరెక్టరేట్ సర్క్యులర్ జారీ చేసింది. కాగా పాఠశాలలకు వెళ్లే సమయంలో కాలుష్యం బారిన పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్.. పిల్లల తల్లిదండ్రులను కోరారు..