లిక్కర్ స్కాం(Liquor scam)లో ఢిల్లీ ముఖ్యమంత్రి(Delhi CM) అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) అధికారులను ఆదేశాలను ఏమాత్రం లెక్కచేయడంలేదు. ఇటీవల ఆయనకు ఈడీ(ED) ఐదోసారి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే, విచారణకు కేజ్రీవాల్ మళ్లీ డుమ్మా కొట్టారు. గతంలో ఇచ్చిన సమన్ల మేరకు కేజ్రీవాల్ శుక్రవారం ఈడీ(ED) ముందు హాజరుకావాల్సి ఉంది.
అయితే, తాను రావట్లేదని కేజ్రీవాల్ చెప్పారు. అక్రమ కేసులు పెట్టి పదే పదే సమన్లు పంపి తనను అరెస్టు చేసి, ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం 2021 నవంబర్‌లో న్యూ ఎక్సైజ్ పాలసీ ప్రవేశ పెట్టింది. బ్లాక్ మార్కెట్ నియంత్రించడం, ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకొచ్చినట్లు చెప్పుకొచ్చారు.
అయితే, లిక్కర్ పాలసీలో నిబంధనలను తుంగలో తొక్కారని 2022 జూలైలో అప్పటి ఢిల్లీ చీఫ్ సెక్రటరీ నరేశ్ కుమార్ బయటపెట్టారు. గవర్నర్ సిఫారసుతో 2022 ఆగస్టులో అప్పటి ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సీబీఐ అధికారులు సోదాలు నిర్వహించి ఈడీ కూడా కేసు నమోదు చేసింది. సిసోడియా సహా 14 మందిపై సీబీఐ అభియోగాలు మోపింది. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది.
ఈ కేసులో ఇప్పటికే మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా తదితరులు అరెస్ట్ అయ్యారు. ఈ క్రమంలో కేజ్రీవాల్‌ను కూడా విచారణకు రావాల్సిందిగా కోరుతూ 2023 నవంబర్ 2, డిసెంబర్ 21, జనవరి 3,18 తేదీల్లో ఈడీ సమన్లు పంపింది. వాటన్నింటినీ ఆయన దాటవేసి విచారణకు హాజరు కానని తేల్చిచెప్పారు. ఈడీ సమన్లు పంపిన ప్రతీసారి ఆయన దాటవేస్తూ వస్తున్నారు.