దేశ రాజకీయాలను కుదిపేస్తున్న ఢిల్లీ (Delhi) లిక్కర్ స్కామ్ కేసు చూయింగ్ గమ్ములా సాగుతున్న విషయం తెలిసిందే.. అయితే త్వరలో పార్లమెంట్ ఎన్నికలున్న నేపత్యంలో మరోసారి ఈ కేసు తెరపైన సంచలనంగా మారింది. ముఖ్యంగా బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీ కవిత (Kavita)కు సీబీఐ (CBI) నోటీసులివ్వడంపై రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ క్రమంలో బీజేపీ (BJP) నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాష్ట్రంలో చర్చాంశనీయంగా మారాయి.
ఈ నేపథ్యంలో కవితకు సీబీఐ నోటీసులివ్వడంపై, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay Kumar) స్పందించారు. నేడు కరీంనగర్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. కీలక వ్యాఖ్యలు చేశారు. లిక్కర్ స్కామ్ లో సీబీఐ సేకరించిన ఆధారాలు, సాక్ష్యాల మేరకే నోటీసులు ఇచ్చారని వెల్లడించారు. వీటి మీద అనుమానాలు లేవన్నారు.. స్వతంత్ర దర్యాప్తు సంస్థలు అయిన సీబీఐ, ఈడీ తీసుకొనే చర్యల్లో ఎలాంటి రాజకీయ జోక్యం ఉండదని పేర్కొన్నారు.
తప్పు చేసినట్లు ఆధారాలు ఉంటే వారు ఎంతపెద్ద వారైనా ఉపేక్షించకూడదనేదే బీజేపీ విధానమని క్లారిటీ ఇచ్చారు. దోషులు తప్పించుకొరని.. వారి ఆటలు ఎక్కువ రోజులు సాగయని అన్నారు. మరోవైపు ఈ ఎన్నికల్లో బీజేపీ 370 ఎంపీ సీట్లు సాధిస్తుందని, మరోసారి కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తోందని ధీమా వ్యక్తం చేసిన బండి సంజయ్.. బీజేపీ చేపట్టిన విజయ సంకల్ప యాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు.
ఇకపోతే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఎమ్మెల్సీ కవితను ఇంతకాలం సాక్షిగా మాత్రమే పరిగణించిన సీబీఐ.. తాజాగా నిందితురాలిగా చేర్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ నెల 26వ తేదీన విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలో సీబీఐ నోటీసులు రాజ్యాంగ విరుద్ధమని తెలిపిన కవిత.. ఎన్నికల షెడ్యూల్ వల్ల బిజీగా ఉండటం వల్ల విచారణకు హాజరు కావడం లేదని సీబీఐకి లేఖ రాశారు.