ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi liquor scam) కేసులో అరెస్టు అయ్యి ప్రస్తుతం తిహార్ జైలులో ఖైదీగా ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(Mlc Kavitha) విధించిన జ్యుడీషియల్ రిమాండ్(14రోజులు) నేటితో ముగియనుంది. దీంతో ఈడీ అధికారులు ఆమెను రౌస్ అవెన్యూ కోర్టుకు తరలించారు.
ఈ సందర్భంగా కవితకు బెయిల్ అప్పుడే ఇవ్వొద్దని, ఆమె రిమాండ్‌ను మరోసారి పొడగించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని కోరినట్లు తెలుస్తోంది. కవిత బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేస్తుందని, సాక్ష్యాలను సైతం తారుమారు చేసే అవకాశం లేకపోలేదని ఈడీ కోర్టుకు విన్నవించింది.
అయితే, అలాంటిది ఏమీ ఉండదని కవిత తరఫు న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. కోర్టు హాలులో కవితతో ఆమె భర్త, మామ మాట్లాడేందుకు అనుమతి ఇవ్వాలని లాయర్ జస్టిస్ భవేజాకు వినతి చేయగా..అప్లికేషన్ సమర్పించాలని జడ్జి సూచించారు.
దీంతో కవిత తరపు లాయర్ అప్లికేషన్ సమర్పించగా.. ఎమ్మెల్సీ కవిత ఆమె భర్త అనిల్ కుమార్, మామ రామకిషన్ రావును కలిసి 2 నిమిషాలు మాట్లాడారు. అయితే, ఈడీ కోరిన విధంగా కవితకు రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి రిమాండ్ విధిస్తుందా? లేక బెయిల్ మంజూరు చేస్తుందా? అనేది మరికాసేపట్లో తేలనుంది