ఢిల్లీలో డెంగ్యూ కేసులు పెరుగుతున్నాయి. ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు 240 కేసులు నమోదు కాగా గతవారం కొత్తగా 56 కేసులు నమోదయినట్టు మున్సిపల్ కార్పొరేషన్ ఓ నివేదికలో తెలిపింది. ఇటీవల భారీ వర్షాలకు తోడు యమునా నది ఉప్పొంగి అనేక లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధికారిక నివాసం, చివరకు సుప్రీంకోర్టు, ఎర్రకోటను కూడా వరద నీరు తాకింది. దోమలు పెరిగిపోవడంతో వైరల్ జ్వరంతో పెద్ద సంఖ్యలో రోగులు ఆసుపత్రుల్లో చేరారు. జ్వరం, కళ్ళమంట, కడుపు నొప్పి, తలనొప్పి వంటి వివిధ రుగ్మతలతో వీరు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వచ్చింది.
నాలుగు రకాల డెంగ్యూ వైరస్ లను దోమలు వ్యాపింపజేస్తూ ఉంటాయి., ఈ వైరస్ సోకినప్పుడు డెంగ్యూ వ్యాధి వస్తుందని, అందువల్ల పరిసరాల్లో నీరు నిలిచిపోకుండా చూసుకోవాలని, పూల కుండీలు, కూలర్ల వంటి వాటిలో నీటిని నిల్వ చేయరాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేడి చేసిన లేదా శుద్ధి చేసిన నీటిని తాగాలని, దోమతెరలు, రెపల్లెంట్స్ వాడాలని, పండ్లు, కూరగాయలను శుభ్రంగా కడగాలని వారు పేర్కొంటున్నారు.
గత ఆరేళ్లలో ఇన్ని డెంగ్యూ కేసులు నమోదు కాలేదని డాక్టర్లు వెల్లడించారు. ఇటీవల ఢిల్లీ ఆరోగ్య శాఖ డెంగ్యు వైరస్ కు సంబంధించి జీనోమ్ సీక్వెన్సింగ్ ను నిర్వహించి 20 శాంపిళ్లకు గాను 19 శాంపిళ్ళలో టైప్ 2 డెంగ్యూ వైరస్ ఉందని, ఇది అత్యంత ప్రమాదకరమని తేల్చింది. సీఎం కేజ్రీవాల్.. గత శుక్రవారం నగరంలో డెంగ్యూ కేసులపై సమీక్షించారు. డెంగ్యూ వ్యాధిపై ప్రజల్లో అవగాహన కలిగించాలని సూచించారు. ఇళ్ల ముందు గానీ, చుట్టుపక్కల గానీ నీరు నిలిచిపోకుండా చూసుకోవాలన్నారు.