Telugu News » వరదలపై ప్రభుత్వం కీలక ప్రకటన

వరదలపై ప్రభుత్వం కీలక ప్రకటన

by admin
ts govt reaction On flood Situation

మొన్నటి వరదలకు రాష్ట్రంలోని పలు జిల్లాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. కొన్ని ఏరియాల్లో పరిస్థితి దారుణంగా తయారైంది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షాలు ప్రభుత్వమే లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తున్నాయి. వరద సాయం విషయంలో సర్కార్ నిర్లక్ష్యాన్ని ఎండగడుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియా పాయింట్ లో మాట్లాడుతూ.. జనం అల్లాడుతుంటే ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైడ్ నుంచి కీలక ప్రకటన వచ్చింది.

ts govt reaction On flood Situation

శాసనసభ శుక్రవారానికి వాయిదా పడినా.. మండలి మాత్రం కొనసాగింది. వరద నష్టం తీవ్రతపై శాసన మండలిలో ప్రభుత్వం ప్రకటన చేసింది. సుమారు 7,870 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు వెల్లడించింది. 139 గ్రామాల ప్రజలను తరలించి, 157 సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పింది. 756 చిన్నతరహా సాగునీటి చెరువులకు గండ్లు పడ్డాయని.. వాటి పునరుద్ధరణకు రూ.171.1కోట్లు అవసరమని వివరించింది.

వరదల కారణంగా 488 రాష్ట్ర రోడ్లు, 29 జాతీయ రహదారులు దెబ్బతినగా వాటిని పునరుద్ధరించామని తెలిపింది ప్రభుత్వం. తాత్కాలిక పునరుద్ధరణ కోసం 253.77 కోట్లు అవసరమని.. అలాగే, శాశ్వత పునరుద్ధరణ కోసం రూ.1,771.47 కోట్లు అవుతాయని చెప్పింది. పంచాయతీరాజ్ శాఖకు సంబంధించిన 1,517 రోడ్లు దెబ్బతినగా.. తాత్కాలిక పునరుద్ధరణ కోసం రూ.187.71 కోట్లు అవసరమని వివరించింది. అదే, శాశ్వత పునరుద్ధరణ కోసం అయితే రూ.1,339.03 కోట్లు అవుతాయని తెలిపింది తెలంగాణ సర్కార్.

ఆగస్టు 8 వరకు తాత్కాలిక పునరుద్ధరణ పనులు పూర్తిచేస్తామని.. భారీ వర్షాలకు 419 ఇళ్లు పూర్తిగా, 7,505 పాక్షికంగా దెబ్బతిన్నాయని చెప్పింది. మున్సిపాలిటీలలో రోడ్లు, డ్రైన్లు, వీధి దీపాల పునరుద్ధరణకు రూ.380 కోట్లు అవసరం అవుతాయని.. జీహెచ్ఎంసీలో రోడ్ల పునరుద్ధరణకు రూ.255.66 కోట్ల ఖర్చు అవుతుందని శాసన మండలిలో వివరించింది. వరదల సమయంలో 8 ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలను అందుబాటులో ఉంచామని.. మోరంచపల్లిలో హెలికాప్టర్, ఆర్మీని దింపామని తెలిపింది ప్రభుత్వం.

You may also like

Leave a Comment