ఎర్ర సముద్రం(Red Sea)లో వాణిజ్య నౌకల(Commercial ships)పై హౌతీ తిరుగుబాటుదారులు (Houthi rebels) దాడులకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఐక్యరాజ్యసమితి (United Nations) సాధారణ అసెంబ్లీ అధ్యక్షుడు డెన్నిస్ ఫ్రాన్సిస్(Dennis Francis) అన్నారు.
ఐదు రోజుల పర్యటనలో భాగంగా భారత్ వచ్చిన ఫ్రాన్సిస్ బుధవారం ఢిల్లీలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఇది మరింత విస్తృతమయ్యే అవకాశం ఉన్నదని, మూడో ప్రపంచ యుద్ధం కూడా రావొచ్చని అభిప్రాయపడ్డారు. ఎర్ర సముద్రంలో హౌతీల దాడులను మూడో పక్షం ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు.
ఇది చాలా ప్రమాదకరమని ఫ్రాన్సిస్ హెచ్చరించారు. పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌తో సమావేశమయ్యారు. నేటి భౌగోళిక రాజకీయ వాస్తవాలకు అనుగుణంగా భద్రతా మండలి ప్రస్తుత కూర్పు లేదని చెప్పారు. దాన్ని సంస్కరించాల్సిన అవసరం ఉందన్నారు.
యెమెన్ దేశాన్ని హస్తగతం చేసున్న హౌతీ తిరుగుబాటు దారులు రవాణా నౌకలపై ఎర్రసముద్రంలో వరుస దాడులతో రెచ్చిపోతున్నారు. క్షిపణులతో దాడులకు తెగపడుతున్నారు. ఇప్పటికే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంతో పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ ఈ ఘటన చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో డెన్నిస్ ఫ్రాన్సిస్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.