Telugu News » Hyderabad : నెక్ట్స్ ఎవరు..? కేటీఆర్ దాకా వెళ్తారా..?

Hyderabad : నెక్ట్స్ ఎవరు..? కేటీఆర్ దాకా వెళ్తారా..?

అప్పట్లో కేటీఆర్ కనుసన్నల్లో ఉన్న హెచ్ఎండీఏలో భారీగా అవినీతి చేసిన శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే.. ఇంకెలాంటి సంచలన విషయాలు వెలుగుచూస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది.

by admin
HMDA Former Director Shiva Balakrishna Arrest by ACB

– అవినీతి తిమింగలం శివ బాలకృష్ణ అరెస్ట్
– వందల కోట్ల ఆస్తులు కూటబెట్టిన తీరుపై దర్యాప్తు
– లాకర్లపై దృష్టి పెట్టిన అధికారులు
– బీఆర్ఎస్ లీడర్లకు సన్నిహితుడిగా ముద్ర
– కస్టడీకి తీసుకుంటే ఇంకెలాంటి విషయాలు బయటకొస్తాయో!
– శివ బాలకృష్ణ అరెస్ట్ తో అవినీతి అధికారుల్లో మొదలైన దడ

తెలంగాణ (Telangana) లో భారీ అవినీతి తిమింగలం ఏసీబీ (ACB) కి చిక్కింది. ఒకటి కాదు.. రెండు కాదు.. వందల కోట్ల అక్రమాస్తులు బయటపడ్డాయి. తవ్వుతున్న కొద్దీ నగదు, బంగారం, భూముల రిజిస్ట్రేషన్ల పత్రాలు, బినామీ పేరిట ఉన్న ఆస్తులు వెలుగుచూశాయి. ప్రస్తుతం రెరా (RERA) ప్రత్యేక కార్యదర్శిగా పనిచేస్తున్న శివ బాలకృష్ణ.. బీఆర్ఎస్ (BRS) హయాంలో హెచ్‌ఎండీఏ (HMDA) డైరెక్టర్‌ గా పని చేశారు. ఆ సమయంలో భారీగా అక్రమాలకు పాల్పడ్డారని ఫిర్యాదు రావడంతో ఏసీబీ రంగంలోకి దిగి సోదాలు జరపగా.. కోట్ల రూపాయల ఆస్తులు బయటపడ్డాయి. అయితే.. నెక్ట్స్ టార్గెట్ ఎవరు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

HMDA Former Director Shiva Balakrishna Arrest by ACB

ముగిసిన సోదాలు.. అరెస్ట్

శివ బాలకృష్ణ ఇంట్లో సోదాలు ముగిశాయని ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర తెలిపారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. శివ బాలకృష్ణ గతంలో హెచ్‌ఏండీఏ మాజీ ప్లానింగ్ డైరెక్టర్ అని, ప్రస్తుతం మెట్రో రైల్ ప్లానింగ్ ఆఫీసర్, రెరా సెక్రటరీగా పని చేస్తున్నారని, ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించామన్నారు. ఆయన సమీప బంధువులు, స్నేహితులు, కొలీగ్స్ నివాసాలు, 17 ప్రదేశాల్లో సోదాలు జరిగాయని వివరించారు. ఒక్క శివ బాలకృష్ణ ఇంట్లోనే రూ.84 లక్షల 60 వేల నగదు, 2 కేజీల బంగారం, 5.5 కేజీల వెండి, రూ.32 లక్షల విలువ చేసే వాచ్‌లు, 3 విల్లాలు, 3 ఫ్లాట్స్, 90 ఏకరాల భూమికి సంబంధించిన పత్రాలు గుర్తించామని చెప్పారు. అంతేకాదు బినామీల పేరుపై భూములు ఉన్నట్లు గుర్తించామని సుధీంద్ర తెలిపారు.

లాకర్లలో ఇంకెన్ని ఉన్నాయో?

శివ బాలకృష్ణతో పాటు అతని కుటుంబ సభ్యులకు చెందిన బ్యాంకు డిపాజిట్లు, లాకర్లను కూడా తెరవడానికి అధికారులు ప్రయత్నాలు మొదలు పెట్టారు. వాటిలో ఏమున్నాయనేది తేలాల్సి ఉంది. వీటితో పాటు మరికొందరు బంధువుల నివాసాల్లో కూడా అధికారులు సోదాలను నిర్వహించారు. బాలకృష్ణ అక్రమ ఆదాయాలపై దర్యాప్తు కొనసాగుతుందని, మొత్తం వివరాలను త్వరలోనే ప్రకటిస్తామని ఏసీబీ ఉన్నతాధికారులు చెబుతున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలకు అత్యంత సన్నిహితుడుగా శివ బాలకృష్ణ వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. వారికి అనుకూలంగా పనులు చేసి లబ్ధి పొందారని ఏసీబీకి ఫిర్యాదులు అందాయి.

కస్టడీకి తీసుకుంటే..!

ఆస్తులపై శివ బాలకృష్ణ నాన్చుడు ధోరణితో ఉండడంతో ఏసీబీ ఆయన్ను అదుపులోకి తీసుకుంది. సరైన సమాధానాలు చెప్పకపోవడంతో కస్టడీకి తీసుకుని విచారిస్తామంటున్నారు అధికారులు. కొన్ని విషయాలను ఆయన దాచిపెడుతున్నారని.. విచారణకు సహకరించలేదని.. కస్టడీకు తీసుకుంటే మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంటుందని అనుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చాలామంది అధికారులతో కలిసి అవినీతి చేసినట్టు డిపార్ట్ మెంట్ లో ప్రచారం జరిగింది. ఛేంజ్ ఆఫ్ ల్యాండ్ యూస్ ప్రక్రియలో పెండింగ్ ఫైల్స్ అక్రమంగా క్లియర్ చేశారని… ఇందుకోసం భారీగా డబ్బుతో పాటు విలువైన భూములను తన పేరుతో రిజిస్టర్ చేయించుకున్నారని బాలకృష్ణపై ఆరోపణలున్నాయి.

అవినీతి అధికారులు ఎందరో..?

అప్పట్లో కేటీఆర్ కనుసన్నల్లో ఉన్న హెచ్ఎండీఏలో భారీగా అవినీతి చేసిన శివ బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే.. ఇంకెలాంటి సంచలన విషయాలు వెలుగుచూస్తాయో అనేది ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్ లో చాలా భూ వ్యవహారాల్లో కేటీఆర్ తలదూర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ ఎటువంటి చర్యలకు దిగుతుందనేది ప్రస్తుతానికి సస్పెన్స్. అయితే.. బీఆర్ఎస్ హయాంలో చాలామంది అధికారులపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుత రేవంత్ సర్కార్ వారిలో చాలామందికి స్థానచలనం కలిగించింది. ఇప్పుడు శివ బాలకృష్ణ అరెస్ట్ తో వారందరిలో వణుకు మొదలైంది. ఎప్పుడొచ్చి ఏసీబీ తమ మీద పడుతుందో అని వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎవరు? అనే చర్చ జరుగుతోంది.

You may also like

Leave a Comment