తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు(Telangana Assembly Elections) ముగియగా ఓట్ల లెక్కింపు(Counting) ఆదివారం జరగనుంది. ఈ సందర్భంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ అంజనీ కుమార్(DGP Anjani Kumar) సూచించారు. సీపీలు, ఎస్పీలతో డీజీపీ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈసందర్భంగా కౌంటింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుపై సమీక్షించారు.
లెక్కింపు కేంద్రాల వద్ద ఎవరినీ గుమిగూడనివ్వొద్దని, పికెటింగ్ చేయడంతో పాటు అదనపు బలగాలను సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. ముఖ్యంగా చివరి రౌండ్లలో ఉత్కంఠగా ఉండే అవకాశం ఉంటుందని, ఆ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు.
ఇప్పటి వరకు ఎలాంటి విఘాతం లేకుండా ఎన్నికల బందోబస్తు నిర్వహించామని, ఈ రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి, ఎలాంటి శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని సీపీలు, ఎస్పీలను అంజనీ కుమార్ ఆదేశించారు.
పోటీలో ఉన్న ప్రధాన పార్టీ అభ్యర్థులతో పోలీసు అధికారులు సమన్వయం చేసుకోవాలని, ఎవరు గెలుపొందిన పోలీసులకు సహకరించేలా వివరించాలని చెప్పారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు ప్రశాంతంగా జరిగేలా చూడాలని, ప్రతీకారదాడులు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డీజీపీ సూచించారు.