నిజామాబాద్ (Nizamabad) ఎంపీ ధర్మపురి అర్వింద్.. పార్లమెంట్ ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ (PM Modi) నిజామాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తానంటే, తానే స్వయంగా ధన్యవాద పాదయాత్ర చేస్తానంటూ తెలిపారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న అర్వింద్.. కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం శ్వేత పత్రాల పేరుతో ఆరు గ్యారంటీల (Six Guarantees) అమలుపై ప్రజలను అయోమయంలో పడేసిందని ఆరోపించారు.
ఎన్నికలప్పుడు ఆరు గ్యారంటీలని హడావుడి చేసిన కాంగ్రెస్.. గెలిచాక శ్వేత పత్రాల పేరుతో పరోక్షంగా గ్యారంటీల అమలుకు డబ్బులు లేవని చెప్పడం సరైన పద్ధతి కాదని ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. అయితే కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వానికి సమయం ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.. రాష్ట్ర పాలన విషయంలో బీజేపీ సహకారం ఖచ్చితంగా ఉంటుందని ఎంపీ ధర్మపురి అర్వింద్(MP Arvind) స్పష్టం చేశారు.
మరోవైపు ప్రజలకు మేలు చేసే పనులకు మద్దతిస్తామని తెలిపిన ధర్మపురి అర్వింద్.. ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను మాత్రం ఖచ్చితంగా వ్యతిరేకిస్తామని చెప్పారు. ఈ క్రమంలో తబ్లికీ జమాత్‌కు రూ.3 కోట్లు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు.. ఇలాంటి వాటికి తాము వ్యతిరేకమని తెలిపారు.. ఇచ్చిన గ్యారంటీలకు డబ్బులు లేవంటే ఊరుకొనే పరిస్థితి లేదని.. ఇచ్చిన హామీలు ఖచ్చితంగా అమలు చేయవలసిందే అని అరవింద్ డిమాండ్ చేశారు..
మరోవైపు కాంగ్రెస్ గ్యారంటీలు పూర్తిస్థాయిలో అమలు కావడం లేదని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ఆరోపించారు. ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి సైతం ప్రభుత్వంపై విమర్శలు చేశారు.. కాంగ్రెస్ బీ ఫాంలు తీసుకొని ఓడిపోయిన నాయకులే నియోజకవర్గాల్లో అధికార కార్యక్రమాలు చేస్తారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే అవుతుందని అన్నారు.