రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) ముగిశాయి.. సింగరేణి ఎన్నికలు (Singareni Elections) సైతం ఎండ్ అయ్యాయి.. ఇక మిగిలి ఉంది పార్లమెంట్ ఎన్నికలు (Parliament Elections). అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో ఎర్రన్నలు పొత్తు పెట్టుకొన్న విషయం తెలిసిందే.. లాభనష్టాలను భేరీజు వేసుకొని.. ఎంతో ఊగిసలాట మధ్య కామ్రేడ్స్ తో చివరికి కాంగ్రెస్ పొత్తు ఖరారు చేసింది. అలా ఇప్పటి వరకు.. వీరి బంధం ఎలాంటి గొడవలు లేకుండా సాగుతోంది.
అయితే ఈ మధ్యసింగరేణి ఎన్నికల తర్వాత రాజకీయంగా కాంగ్రెస్ (Congress).. సీపీఐ (CPI) మధ్య విభేదాలు వచ్చాయని… తగవులాడుకుంటున్నారని జరుగుతోన్న ప్రచారం పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (Narayana) క్లారిటీ ఇచ్చారు.. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలకు…రాజకీయాలకు సంబంధం లేదని నారాయణ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న నారాయణ.. కొంతమంది కాంగ్రెస్, సీపీఐ విడిపోతాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దుష్టసంప్రదాయానికి తెరలేపిందని ఆరోపించిన నారాయణ.. ఎన్నికల సమయంలో కార్మికులను ప్రలోభాలకు గురి చేశారని విమర్శించారు.
తప్పుడు ఆలోచనలతో చేసిన పనులు ఎన్నో రోజులు దాగవన్న నిజాన్ని గుర్తించిన కార్మికులు.. ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ ని గెలిపించడం ఆనందంగా ఉందన్నారు నారాయణ.. ఇక ఇటీవల జరిగిన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ విజయం సాధించిన విషయం తెలిసిందే..