అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) వచ్చే నెలలో జరుగనున్న నేపధ్యంలో ఐదు రాష్ట్రాల్లో సీనియర్ అధికారులను ఈసీ (EC) బదిలీ చేసింది. తెలంగాణ (Telanga) లో మొత్తం 20 మంది అధికారులను ట్రాన్స్ఫర్ చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో 13 మంది పోలీస్ కమిషనర్లు, ఎస్పీలు, నలుగురు కలెక్టర్లు, ముగ్గురు ఇతర శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. కాగా బదిలీ అయిన వారి స్థానంలో కొత్త వారిని నియమిస్తున్నారు.
తాజాగా హైదరాబాద్ (Hyderabad) సీపీగా సందీప్ శాండిల్యను (Sandeep Shandilya) నియమించారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా ఎవరు వస్తారన్న అంశానికి ఈ రోజుతో తెరపడింది. మరోవైపు ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్య కార్యదర్శిగా సునీల్ శర్మ, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్‌గా క్రిస్టినా పేర్లను ప్రకటించారు.
యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆసీసీ సగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోలీకేరీ, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతంను నియమించారు, దాదాపుగా బదిలీలు జరిగిన అన్నీ స్థానాల్లో కొత్త అధికారులను నియమించగా.. బదిలీ అయిన వాళ్లు ఈ రోజు సాయంత్రం లోపు బాధ్యతలు తీసుకోవాలని సీఎస్ శాంతి కుమారి (Shanti Kumari) ఆదేశించారు. మరోవైపు ఐపీఎస్‌ల బదిలీతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొన్ని ఖాళీ అయ్యాయి. ఆయా స్థానాలను సమీపంలో ఉన్న డీసీపీలకు కేటాయించారు. త్వరలో బదిలీ అయిన స్థానాలకు కొత్త ఐపీఎస్‌లను కేటాయించనున్నట్టు అధికారులు తెలిపారు.