Telugu News » BJP : తెలంగాణ బీజేపీలో డీఎన్ఏ లొల్లి..!

BJP : తెలంగాణ బీజేపీలో డీఎన్ఏ లొల్లి..!

బీజేపీ సిద్దాంతాలను ఫాలో అవుతూ మొదట్నుంచి పార్టీని అంటిపెట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. వీళ్లు తమ కంటే పార్టీ బాగు కోసమే తపిస్తుంటారు. ఆర్థికంగా బలంగా లేకపోయినా సరే.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమ శాయశక్తులా కష్టపడుతుంటారు.

by admin

– తెలంగాణ బీజేపీలో గందరగోళం
– కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలతో తలనొప్పి
– ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి ఝలక్
– వివేక్, విజయశాంతి తీరుపై అనుమానాలు
– కీలకమైన సమయంలో సైలెంట్ గా ఉండడంపై..
– కిందిస్థాయి కార్యకర్తల అసహనం

– శేరిలింగంపల్లిలో బీజేపీ సీనియర్ నేతకు అన్యాయం జరుగుతోందా?
– పక్షపాత ట్వీట్లపై కార్యకర్తల అనుమానం!
– కాంగ్రెస్ డీఎన్ఏని వదులుకోలేకపోతున్నారా?
– బీజేపీ డీఎన్ఏకి సెట్ కావడం లేదా?
– పార్టీ సిద్దాంతాలకు కట్టుబడని..
– నేతల ఒంటెద్దు పోకడలపై నిలదీత

తెలంగాణ (Telangana) లో పాగా వేయాలని శతవిధాలా ప్రయత్నిస్తోంది బీజేపీ (BJP). బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతోంది. కాంగ్రెస్ (Congress) పాలనలో ఎదుర్కొన్న కష్టాలను ప్రజలకు వివరిస్తోంది. ఈసారి పక్కాగా గెలుస్తామని ధీమాగా చెబుతోంది. అయితే.. పార్టీలోని కొందరి నేతల తీరుతో గ్రూపు గొడవలు ఎక్కువయ్యాయనే ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ డీఎన్ఏ, బీజేపీ భావజాలం మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నట్టుగా రాజకీయ పండితులు సైతం కొన్ని విషయాలను ఉదహరిస్తున్నారు.

బీజేపీ సిద్దాంతాలను ఫాలో అవుతూ మొదట్నుంచి పార్టీని అంటిపెట్టుకున్నవాళ్లు చాలామందే ఉన్నారు. వీళ్లు తమ కంటే పార్టీ బాగు కోసమే తపిస్తుంటారు. ఆర్థికంగా బలంగా లేకపోయినా సరే.. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి తమ శాయశక్తులా కష్టపడుతుంటారు. అయితే.. ఇతర పార్టీల నుంచి బీజేపీలోకి వచ్చిన లీడర్లలో కొందరు పదవులే ముఖ్యంగా రావడం.. వచ్చాక చాలా విషయాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుండడం.. ముందు నుంచి ఉన్న లీడర్లను లైట్ తీసుకోవడం.. బీజేపీ డీఎన్ఏకు సెట్ అవ్వకపోవడం లాంటివి జరగడంతో గ్రూప్ గొడవలు ఎక్కువయ్యాయని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డినే ఉదాహరణగా చెబుతున్నారు. ఆయన బీజేపీలోకి ఎందుకొచ్చారో.. ఎందుకు బయటకు వెళ్లారో తెలియడం లేదంటున్నారు. ఈయన దారిలోనే కొందరు నేతలు నడుస్తుండడం.. మరీ ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలే జంప్ అవుతుండడం, సైలెంట్ గా ఉండడం పట్ల పార్టీ వర్గాలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నాయి. అసలు, రావడం ఎందుకు.. వెళ్లిపోవడం ఎందుకు.. సైలెంట్ గా ఉండడం ఎందుకు? అంటూ ప్రశ్నిస్తున్నాయి. బీజేపీకి కొన్ని సిద్దాంతాలు ఉన్నాయని.. వాటిని నమ్మి పార్టీలోకి వచ్చి ఫాలో అయ్యేవారికే ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నాయి.

కాంగ్రెస్ నుంచి చాలామంది నాయకులు బీజేపీలో చేరారు. గత రెండు పర్యాయాలు బీఆర్ఎస్ గెలవడంతో ఆయా సందర్భాల్లో కాంగ్రెస్ నుంచి విపరీతంగా వలసలు కొనసాగాయి. ఆ సమయంలో కొందరు బీఆర్ఎస్ లోకి వెళ్లగా.. ఇంకొందరు బీజేపీ బాట పట్టారు. వారిలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్, విజయశాంతి, డీకే అరుణ, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మూలాలున్న ఫ్యామిలీ నుంచి వచ్చిన అరవింద్.. ఇలా లిస్టు చాలా పెద్దదే ఉంది. వీళ్లందరి టార్గెట్ కేసీఆర్ మాత్రమే. బీఆర్ఎస్ సర్కార్ ను గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తున్నారు. కాకపోతే కొందరు బీజేపీ సిద్దాంతాలకు కట్టుబడకుండా వ్యవహరిస్తున్నారని కింది స్థాయి కార్యకర్తలు అనుకుంటున్నారు.

ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వెళ్లిపోయారు. వివేక్ సంగతి అయోమయంగా ఉంది. కీలకమైన ఈ సమయంలో విజయశాంతి కనిపించడం లేదు. ఇంకొందరు నేతలది కూడా ఇదే తీరు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా నాయకులు కట్టుబడి ఉండాలి.. హైకమాండ్ వ్యూహాలకు తగ్గట్టుగా పని చేసుకుంటూ.. ఇతర నాయకులను కలుపుకుని పోతూ వెళ్లాలి.. అంతేగానీ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడం.. మొదట్నుంచి బీజేపీ సిద్దాంతాలకు కట్టుబడి పని చేస్తున్న వారిని టార్గెట్ చేయడం.. కొత్తవారిని అతిగా ప్రోత్సహించడం లాంటివి చేసి అనవసర గొడవలకు కారణమౌతున్నారని కార్యకర్తలు తెగ మాట్లాడుకుంటున్నారు. ఈమధ్య హైదరాబాద్ పరిధిలోని ఓ నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి వచ్చిన నాయకుడికి అనుకూలంగా ట్వీట్లు చేయడం పెద్ద రభసకు దారితీసింది. అదికూడా కాంగ్రెస్ మూలాలున్న ఇద్దరు నేతలే అలా చేయడం పట్ల కిందిస్థాయి కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ డీఎన్ఏని వదులుకుని.. బీజేపీ డీఎన్ఏకి సెట్ కావాలని వారు కోరుతున్నారు.

You may also like

Leave a Comment