అయోధ్య(Ayodhya)లో అంగ రంగ వైభంగా బాల రాముడు మందిరంలోని గర్భ గుడిలో గృహ ప్రవేశం చేశాడు. ప్రధాని మోడీ (Modi) చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట కార్యకమం ఘనంగా జరిగింది. శ్రీ రామ చంద్రుడు ఐదేళ్ళ బాలుడుగా విల్లు, ధనుస్సు చేత బట్టి చిరునవ్వుతో బంగారు నగలతో దర్శనం ఇస్తున్న ముగ్ద మనోహర రూపం చూసిన వారు భక్తి పారవశ్యంలో మునిగి పోతున్నారు. దీంతో 500 ఏళ్ల హిందువుల కల సోమవారం సాకారం అయింది.
మరోవైపు ధగ ధగ మెరిసే బంగారునగలను ధరించిన బాల రాముడు భక్తుల చూపులను తన దగ్గరే కట్టేసుకొన్నారు. ఇంటర్నేషనల్ జెమోలాజికల్ ఇన్స్టిట్యూట్ ( IGI) సర్టిఫికేషన్ పొందిన.. ఉత్తర్ ప్రదేశ్ (Uttar Pradesh), లక్నో (Lucknow)లోని, హర్షహైమల్ షియామ్లాల్ జ్యువెలర్స్ సంస్థ ఈ అద్భుతమైన నగలను రూపొందించింది.. ఈ ఆభరణాల తయారీకి ప్రేరణ హిందూ గ్రంథాలతో పాటు టీవీ షో రామాయణ్ నుంచి పొందామని CEO అంకుర్ ఆనంద్ తెలిపారు.
రాములోరికి అలంకరించిన ఆభరణాల తయారీలో దాదాపు 132 మంది కళాకారులు అవిశ్రాంతంగా శ్రమించారు. నుదిటి తిలకంగా బంగారు నామం, పచ్చల ఉంగరాలు, కంఠాభరణాలు, కిరీటం, కంకణాలు ఇలా సర్వాలంకార భూషితుడైన రామయ్య.. భక్తులకు తన మొదటి దర్శనాన్ని ఇచ్చాడు. బాల రామయ్యకు అలంకరించిన ఈ నగలలో 18,567 వజ్రాలు, 2,984 కెంపులు, 615 పచ్చలు, 439 అన్కట్ వజ్రాలు ఉన్నాయి.
మరోవైపు దివ్యమైన రూపంతో భక్తులకు దర్శనమిస్తున్న రాముడిని చూడడానికి రెండు కళ్లు సరిపోవడం లేదని భక్తులు ఆనందపడుతున్నారు. ఇది ఎన్ని శతాబ్దాల ఎదురుచూపో.. బాల రాముని రాకకోసం అయోధ్యాపురి ఎంత తపించిందో.. అదిగో మన అయోధ్య బాలరాముడు.. ఆ పురుషోత్తముని తొలి దర్శనంతో.. హృదయం ఆనందంతో పరవశిస్తోందని అనుకోని భక్తుడు లేడు..